ఎవ్వరినీ కలవలేదు.. ఎక్కడికీ వెళ్లలేదు.. అయినా కరోనా!!

కరోనాని కట్టడి చేయాలంటే బయటకు వెళ్లకపోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ప్రధాని మాటకు కట్టుబడి అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ , హైదరాబాద్ గాంధీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతూ మంచంలో ఉన్నారు. ఆయన ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. పోనీ వాళ్లింటికి ఈ మధ్య విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా అంటే అదీ లేదు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతుంటే ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించారు కుటుంబసభ్యులు అతడికి. కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చేసరికి ఇంట్లో వారితో పాటు, డాక్టర్లూ ఖంగుతిన్నారు.
ఇదిలా వుండగా మరో కేసు టోలీచౌకిలో వెలుగు చూసింది. ఓ 8 ఏళ్ల బాలికకు ఉన్నట్టుండి దగ్గు, జలుబు, జ్వరం వచ్చాయి. దీంతో చికిత్స కోసం బంజారా హిల్స్ లోని పిల్లల ఆసుపత్రి తీసుకు వెళ్లగా, వైద్యులు అనుమానంతో కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్‌గా తేలడంతో తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఈ రెండు కేసులు చూసిన తరువాత ఎక్కడికీ వెళ్లకపోయినా, ఎవరితో కాంటాక్ట్ లేకపోయినా కరోనా ఎలా వస్తుందో తెలియట్లేదని అధికారులు తల పట్టుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com