కరోనా కష్టాలు.. బంగారాన్ని అమ్మేస్తున్నారు..

కరోనా కష్టాలు.. బంగారాన్ని అమ్మేస్తున్నారు..

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గం అని దాదాపుగా అన్ని దేశాలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో కొన్ని పరిశ్రమలు జీవనం కొనసాగించలేక మూత పడ్డాయి. కొంత మందిని ఉద్యోగాల నుంచి తీసేసారు. మరి కొన్ని కంపెనీలు మాకూ ఇన్‌కం లేదంటూ సగం జీతమే ఇచ్చి సరిపుచ్చుకోమంటున్నాయి. లాక్డౌన్ ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుందని తెలిసినా మరో దారి లేదు.

ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కడుపుకి ఆకలి వుంటుంది. మరి డబ్బులు లేకపోతే నిత్యావసరాలు ఎలా సమకూర్చుకునేది అని థాయిలాండ్ వాసులు అవసరానికి అక్కరకొస్తుందని కొని దాచిపెట్టుకున్న బంగారాన్ని ఇప్పుడు అమ్మేస్తున్నారు. దాదాపుగా థాయ్ వాసులందరూ ఇలా బంగారాన్ని అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం బంగారం రేటు పెరగడం కూడా వారికి కలిసొచ్చిన అంశం. ఉదయం 8 గంటల నుంచి మొదలు బంగారం షాపుల వద్ద థాయ్ వాసులు క్యూ కట్టేస్తున్నారు.

ఇదే విషయంపై ఓ బట్టల దుకాణదారు మాట్లాడుతూ.. మా షాపులో పని చేసే వర్కర్లకి జీతాలు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. అందుకే బంగారాన్ని అమ్మేస్తున్నాను అని చెప్పాడు. వీరంతా మాస్కులు ధరించి క్యూల్లో నిల్చున్నారు. 60 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు బంగారం అమ్మడం ఇదే మొదటి సారి అని బంగారం వర్తకులు అంటున్నారు. కాగా, థాయిలాండ్లో కరోనా పాజిటివ్ కేసులు 2,672 నమోదు కాగా 46 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. మాల్స్, బార్‌లు, విమాన రాకపోకలను నిషేధించడంతో కొంతవరకు కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story