రష్యా రాజధాని మాస్కోలో కరోనా వీరంగం..

రష్యా రాజధాని మాస్కోలో కరోనా వీరంగం..
X

కరోనా కట్టడిలో రష్యా కట్టుదిట్టమైన చర్యలు అవలంభించి కేసుల సంఖ్య తగ్గించుకుంది అని అనుకుంటున్న తరుణంలో గత రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరగడం ఆ దేశ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా గత రెండు రోజుల్లో పాజిటివ్ కేసులు 10,328గా నమోదవగా ఒక్క మాస్కో నగరంలోనే 5,596 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు రికార్డైన కేసుల సంఖ్య 47,121 కాగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 405కు చేరుకుంది. వచ్చే రెండు మూడు వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మాస్కో డిప్యూటీ మేయర్ అనస్తాసియా రకోవా అంటున్నారు.

రష్యాలో మొదటి కరోనా కేసు జనవరి 31నే నమోదైంది. మాస్కోలో మార్చి 6 నుంచి కరోనా కేసులు వెలుగు చూశాయి. కట్టడి నివారణ చర్యలు కూడా సత్వరం చేపట్టలేదు. కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో మార్చి 30 నుంచి లాక్‌డౌన్ విధించారు. క్వారంటైన్ చేసిన చైనా విద్యార్ధులు లాక్‌డౌన్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. రష్యా పౌరులు సైతం కొంత నిర్లక్ష్య ధోరణి కనబరిచారు. ఈ కారణాలతో కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

దేశంలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేసినట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ధికంగా అభివృద్ది పథంలో ఉన్నా.. 2012 తర్వాత నుంచి ప్రభుత్వం.. ఆసుపత్రులలో ఉన్న సిబ్బందిని తగ్గిస్తూ వచ్చింది. దాంతో ఇప్పుడు కరోనా కేసులను ట్రీట్ చేయడం ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడికి దారి తీసింది. దాంతో వైద్య విద్యార్థులే డాక్టర్లుగా మారి కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు.

కాగా, కరోనాను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన చైనా సైతం రష్యా మీద మండి పడుతోంది. మా దేశంలో కరోనాను కట్టడి చేయగలుగుతున్నా రష్యా నుంచి కేసులు అధిక సంఖ్యలో వస్తున్నాయని ఆదేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో సరిహద్దుల్లో నిలిచి పోయిన చైనీయులను మాత్రం స్వదేశంలోకి అనుమతించడానికి నిరాకరిస్తోంది. కరోనాను అంటించింది మీరు.. పైగా మాపై అభాండాలా అని రష్యా.. చైనా మీద ఒంటికాలిపై లెగుస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలు ఒకదానిపై ఒకటి గుర్రుగా ఉన్నాయి.

Tags

Next Story