కరోనా మిగిల్చిన కన్నీళ్లు.. భర్త మృతి.. భార్యకు రాసిన భావోద్వేగ లేఖ

కరోనా మిగిల్చిన కన్నీళ్లు.. భర్త మృతి.. భార్యకు రాసిన భావోద్వేగ లేఖ

కరోనా.. కొన్ని బంధాలను దూరం చేస్తోంది. మరి కొన్ని బంధాలను దగ్గర చేస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇంటి పట్టున ఉండి కుటుంబ బాగోగుల్నిపట్టించుకుంటూ, బంధాలను బలపరుచుకుంటున్న వారు కొందరైతే, ఈ వైరస్ మహమ్మారి మరికొంత మందిని పొట్టన పెట్టుకుని ఆత్మీయుల కళ్లలో కన్నీరు మిగులుస్తోంది. అయిన వాళ్ల ఆఖరి చూపుకు నోచుకోనివ్వకుండా చేస్తోంది. దగ్గరుండి చూసుకోవాల్సిన సమయంలో దగ్గరకే రానివ్వకుండా చేస్తోంది.

తాజాగా అమెరికాకు చెందిన జోనాథన్ నెలరోజుల నుంచి కరోనాతో పోరాడి.. చివరకు ఓడి పోయి తనువు చాలించాడు. నేనిక బ్రతకను, బెడ్ మీద ఉన్నాను అని తెలిసిన మరుక్షణం తను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన భార్యకు ప్రేమ పూర్వక లేఖ రాశాడు. ఇప్పుడా లేఖ అతడి భార్యని మరింత భావోద్వేగంలోకి నెట్టింది. జోన్‌, కేటీల కాలేజీ రోజుల్లో ప్రేమ పెళ్లికి దారి తీసింది. తరువాత ఇద్దరు పిల్లలు పుట్టారు. కొడుకుకు పుట్టుకతోనే జబ్బు చేసింది. బ్రెయిన్ డెడ్ కావడంతో కొద్ది రోజులు కోమాలో ఉండి పోయాడు. అయినా బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంది కేటీ. ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ కోలుకున్నాడు. జోన్ న్యాయవాద వృత్తిలో వుండడంతో బిజీగా వుండేవాడు. ఇంటి బాధ్యతలన్నీ కేటీ చూసుకునేది.

ఈ క్రమంలోనే జోన్‌కి కరోనా సోకింది. వైరస్ సోకిందని తెలుసుకుని ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉన్నాడు. అయినా వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. నెల రోజుల పోరాటం అనంతరం గురువారం జోన్ మరణించాడు. భార్య కేటీ జోన్‌ను చూసేందుకు హాస్పిటల్‌కు వెళ్లేసరికి అప్పటికే అతడు మృతి చెందాడు. కోవిడ్ కారణంగా గుండెపోటు వచ్చి జోన్ మరణించాడని వైద్యులు కేటీకి తెలిపారు. భారమైన హదయంతో భర్త వస్తువులన్నీ తీసుకుని కేటీ ఇంటికి చేరుకుంది. జోన్ ఫోన్ చూస్తుండగా అందులో అతడు రాసిన లేఖ కనిపించింది.

'నేను నిన్ను నా ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తున్నాను. నేను ఊహించిన దాని కంటే పదిరెట్లు ఎక్కువే నీ ప్రేమను నాకు పంచావు. నీ ప్రేమను పొందిన నేను చాలా అదృష్టవంతుడిని. నీకు భర్తగా, పిల్లలు బ్రాడిన్, పెన్నీలకు తండ్రిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అంతే కాకుండా నేను చూసిన అమ్మాయిల్లో అత్యంత అందమైన వ్యక్తిత్వం, కేరింగ్ ఉన్న మహిళవు నీవు అని భార్యను ఉద్దేశించి రాశాడు. నా పిల్లలకు ఉత్తమమైన తల్లిగా ఉన్న నిన్ను చూసిన ఆ క్షణం నా జీవితంలో అత్యంత అద్భుతమైనది అని రాస్తూ..

నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి, మన పిల్లలలను తన పిల్లలుగా భావించే వ్యక్తి నీ జీవితంలో తారసపడితే దయచేసి తిరస్కరించకు.. అంగీకరించి అతడితో ఆనందంగా జీవించు. అదే నువ్వు నాకిచ్చే నిజమైన నివాళి అంటూ జోన్.. భార్య కేటీకి భావోద్వేగ లేఖ రాశాడు. కాగా, యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 8,90,000 మంది అయితే మృతి చెందిన వారు 50 వేలకు పైగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story