30 శాతంగా కరోనా రికవరీ రేటు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56 వేలు దాటింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు దాదాపు 18 వేలకు చేరుకున్నాయి. మృతుల సంఖ్య దాదాపు 7 వందలకు చేరుకుంది. ఒక్క ముంబయి నగరంలోనే 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 437 మంది మృత్యువాతపడ్డారు. ముంబయి తర్వాత పునె, థానే, నాసిక్, ఔరంగాబాద్ జిల్లాల్లో.. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అటు గుజరాత్‌లో కరోనా కేసులు 7 వేలు దాటగా.. 425 మంది చనిపోయారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 6వేలకు దగర్లో ఉండగా.. 66 మంది మరణించారు. తమిళనాడు, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, యూపీల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.
దేశంలో కరోనా రికవరీ రేటు 29.36 శాతంగా ఉందన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. 216 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కావడంలేదన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు కోలుకుంటున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. ప్లాస్మా థెరపీ చికిత్స ఎంతవరకు సురక్షితం అనే అంశంతోపాటు.. దాని సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు 21 ఆసుపత్రుల్లో ICMR క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుందన్నారు. 222 శ్రామిక్ రైళ్లలో రెండున్నర లక్షల మంది వలస కూలీలను తరలించామన్నారు లవ్ అగర్వాల్.
మే 17న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ ప్లాన్‌పై కేంద్రానికి స్పష్టత ఉండాలన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం తన విధానాల పట్ల పారదర్శకంగా ఉండాలన్నారు. వెంటనే లాక్‌డౌన్ తదనంతర మార్గదర్శకాలను సిద్ధం చేయాలన్నారు రాహుల్ గాంధీ. ఇది స్విచ్ ఆన్.. ఆఫ్ చేయడం అంత ఈజీ కాదని.. అన్ని స్థాయిల్లో సమన్వయం అవసరమని ప్రధాని మోదీకి సూచించారు. దేశానికి బలమైన ప్రధానితోపాటు బలమైన ముఖ్యమంత్రులు కూడా అవసరమన్నారు. లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వారికి వెంటనే ఆర్థిక సాయం అందించాలని సూచించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరంలో పాటించడంలో భాగంగా మద్యాన్ని హోం డెలివరీ చేయడం, పరోక్ష అమ్మకాలను వంటి అవకాశాలపై రాష్ట్రాలు ఆలోచించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించవచ్చని తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు మూసేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై.. సుప్రీం స్పందించింది.. ఈ సూచనలు చేసింది. దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీచేయమని సుప్రీం కోర్టు తెలిపింది.
కేంద్రం లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా తమిళనాడులో మద్యం షాపులు తెరవడంపై కొన్ని చోట్ల మహిళలు ఆందోళనకు దిగుతున్నారు. మద్యం షాపుల వద్ద రద్దీ పెరిగి కరోనా మరింతగా వ్యాపిస్తుందని మధురై మహిళలు నిరసన చేపట్టారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుని పోయిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు కదులుతున్నారు. ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో ఇంటిబాటపడుతున్నారు. ప్రత్యేక పర్మిషన్‌లతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి రైళ్లలో తరలిస్తున్నారు. ఇలా పనాజీ నుంచి గ్వాలియర్‌కు 12 వందల మంది వలస కార్మికులు ప్రత్యేక రైల్లో ప్రయాణమయ్యారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇళ్లకు వెళ్లడం సంతోషంగా ఉందంటున్నారు వలస కూలీలు.
జమ్మూకాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో చినాబ్ టెక్స్‌టైల్స్ కార్మికుల నిరసన హింసాత్మకంగా మారింది. లాక్‌డౌన్ వేళ జీతాలు తగ్గించడంతో.. వలస కార్మికులు ఆందోళనకు దిగారు. వాళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com