గాంధీ హాస్పిటల్ కరోనా పాజిటివ్‌ రోగులకు ప్లాస్మా చికిత్స

గాంధీ హాస్పిటల్ కరోనా పాజిటివ్‌ రోగులకు ప్లాస్మా చికిత్స
X

సోమవారం నుంచి గాంధీ హాస్పిటల్ కరోనా పాజిటివ్‌ రోగులకు ప్లాస్మా చికిత్స చేయనున్నారు. ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి దాన్ని రోగులకు ఇవ్వడం ద్వారా ఈ చికిత్స చేస్తారు. 15 మంది ఇప్పటికే ప్లాస్మా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ICMR సూచించిన నిబంధనలకు అనుగుణంగా.. ఈ ప్లాస్మా థెరపీ చేస్తున్నామని ఇది క్లినికల్ ట్రయల్స్‌ మాత్రమేనని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఒక్కొక్కరి ప్లాస్మాతో ఇద్దరికి చికిత్స చేసే వీలుంది. సోమవారం ఐదుగురు రోగులకు ప్లాస్మా థెరపీ చేయనున్నారు. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా.. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్న వారికి, అలాగే వివిధ రోగాలతో బాధపడుతూ ఆరోగ్యం క్లిష్టంగా మారిన వారికి.. ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేస్తారు.

రక్తంలో తెల్ల, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌, ఇతర కణజాలాన్ని తొలగించాక మిగిలేదాన్ని ప్లాస్మా అంటారు. ఆ ప్లాస్మాను ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎక్కించే వైద్య ప్రక్రియే ప్లాస్మా థెరపీ. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఆ వైరస్‌తో పోరాడి గెలవడం వల్ల అతని ప్లాస్మాలో కరోనాపై పోరాడే యాంటీ బాడీస్‌ ఉంటాయి. వీటిని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి బాధపడుతున్న వారికి ఎక్కిస్తే ఫలితం ఉంటుంది. ఐతే.. ఈ ప్లాస్మాను సేకరించే విషయంలో కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా నుంచి కోలుకొని నెగెటివ్‌ వచ్చిన 28 రోజుల తర్వాత కూడా.. ఇన్ఫెక్షన్‌ లక్షణాలు లేని, ఇతర ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. అలాంటి వాళ్ల నుంచే రోగ నిరోధక కణాలను సేకరించి ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న రోగి శరీరంలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇలా ప్రవేశపెట్టిన కణాలు రోగి రక్తంలోకి ప్రవేశించి, 3, 4 రోజుల్లోనే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు వస్తాయని గతానుభవాలు చెబుతున్నాయి.

Tags

Next Story