13 May 2020 9:36 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / చైనాకు ఊహించని షాక్...

చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన భారతదేశం

చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన భారతదేశం
X

చైనా అంటేనే నక్కజిత్తులకు పెట్టింది పేరు. మాయమాటలకు, దొంగబుద్దులకు చైనా కేరాఫ్ అడ్రస్. ఇతర దేశాల భూభాగాలను కబ్జా చేయడం అంటే చైనాకు మహా ఇష్టం. వివాదం లేని ప్రాంతాల్లోనూ ఏదో రకంగా వేలు పెట్టి వివాదం రేపడమే ఆ దేశం పని. ముఖ్యంగా మనదేశంతో పదే పదే గొడవ పెట్టుకోవడం చైనాకు అలవాటుగా మారింది. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటడం, మన జవాన్లతో తగాదాకు దిగడమే డ్రాగన్‌ పని. తాజాగా వాస్తవాధీన రేఖ వద్ద చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. డ్రాగన్ కుట్రను వెంటనే పసిగట్టిన భారత సైన్యం ఒక్కసారిగా ఎదురుదాడి చేసి షాక్ ఇచ్చింది.

జమ్మూకశ్మీర్‌లోని లఢాఖ్‌ వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. చైనా మిలటరీ హెలికాప్టర్లు లఢఖ్ గగనతలంపై చక్కర్లు కొట్టాయి. ఇది బోర్డర్ రూల్స్‌కు విరుద్దం. ఒకరి బోర్డర్‌ను మరొకరు పర్మిషన్ లేకుండా దాటడం దురాక్రమణ కిందికే వస్తుంది. ఇవన్నీ చైనాకు తెలుసు. ఐనప్పటికీ దొంగ బుద్ది మారదు కదా. అందుకే, లఢాఖ్ వద్ద వాస్తవాధీన రేఖ సమీపంలోకి హెలికాప్టర్లను పంపించింది.

ఎల్‌ఏసీ వద్ద చైనా సైనిక హెలికాప్టర్ల కదలికలను మన రాడార్లు వెంటనే పసిగట్టాయి. ఆ వెంటనే ఆర్మీని అలర్ట్ చేశాయి. దాంతో సైన్యం ఒక్కసారిగా అలర్టైపోయింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హుటాహుటిన రంగంలోకి దిగింది. ఏకంగా యుద్దవిమానాలను పెట్రోలింగ్‌కు పంపింది. సుఖోయ్-30-MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో లఢాఖ్ సరిహద్దు వద్ద గస్తీ నిర్వహించింది. మన యుద్ధ విమానాలను చూడగానే చైనా సైనిక హెలికాప్టర్లు వెనక్కి తగ్గాయి.

సుఖోయ్-30 యుద్ధ విమానాలను బోర్డర్‌కు తరలించి గస్తీ నిర్వహించడమే చైనాకు షాక్‌ ఇచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. చైనా కవ్వింపులకు ఈ స్థాయిలో బదులు ఎప్పుడూ ఇవ్వలేదు. ఎల్‌ఏసీ వద్ద చైనా సైనిక హెలికాఫ్టర్లు ఎగురుతుండగా భారత్ వెంటనే స్పందించి యుద్ధ విమానాలను పెట్రోలింగ్‌కు పంపడడం ఇదే తొలిసారి అని రక్షణ నిపుణులు తెలిపారు. సుఖోయ్ 30 ఎమ్‌కేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చైనా ఆర్మీకి గట్టిగా బదులిచ్చిందని చెప్పారు.

చైనా ఇలా చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. గత వారం సిక్కింలోని నకులా పాస్ వద్ద భారత బలగాలతో చైనా బలగాలు తలపడ్డాయి. చైనా సైనికులను భారత జవాన్లు దీటుగా ఎదుర్కొన్నారు. సరి హద్దు దాటకుండా చైనా దళాలను గట్టిగా నిరోధించారు. భారత సైనికుల తీవ్ర ప్రతిఘటనతో చైనా జవాన్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ ఘటన మరిచిపోకముందే చైనా మిలటరీ హెలీకాప్టర్లు లఢాఖ్‌ వద్ద వాస్తవాధీన రేఖపై చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఐతే, చైనా సైనిక హెలికాప్టర్లు వాస్తవాధీన రేఖను దాటలేదని అధికారవర్గాలు వివరణ ఇచ్చాయి.

లఢాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలపై చైనాకు ఎప్పటి నుంచో కన్నుంది. ఆ మూడు ప్రాంతాలు తమవే అంటూ బుకాయిస్తోంది. గత ఏడాది మోదీ సర్కారు లఢాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి చైనాతో పాటు పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. తాజాగా గిల్గిట్-బాల్టిస్థాన్‌లను కూడా లఢాఖ్ రీజియన్‌లో కలిపేసి మరో షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయాలు చైనా, పాకిస్థాన్‌లకు మింగుడు పడడం లేదు. అందుకే సరిహద్దుల్లో అలజడులు సృష్టించడానికి పదే పదే కవ్వింపులకు పాల్పడుతున్నాయి.

పాకిస్థాన్ కూడా సరిహద్దుల్లో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. బోర్డర్‌లో ఎఫ్-16, జెఎఫ్-17 విమానాలతో గస్తీ నిర్వహిస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట గస్తీ ఎక్కువగా ఉంటోంది. హంద్వారా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్థాన్ ఈ చర్య తీసుకుంది. హంద్వారా ఉగ్రదాడిలో ఒక కల్నల్, ఒక మేజర్ సహా ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల హస్తముంది. దాంతో భారతసైన్యం ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని పాకిస్థాన్ వణికిపోతోంది.

Next Story