తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లాలో అందరికీ ఇళ్లు కోసం వివాదస్పాద ఆవ భూముల సేకరణ, భారీ కుంభకోణంపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ బూరుగుపూడి వెళ్లింది. ఐతే.. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు పోలీసులు. లాక్‌డౌన్, 144 సెక్షన్ నేపథ్యంలో.. టీడీపీ నేతల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త వాతావరణంలోనే టీడీపీ నాయకులు వెళ్లి ఆవ భూముల్ని పరిశీలించారు. ఈ కమిటీలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ తదితరులు ఉన్నారు.
ఏడాదిలో ఆరేడు నెలలు ముంపునకు గురై నీటిలోనే ఉండే ప్రాంతాలను పేదల ఇళ్ల కోసం సేకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో 42 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు టీడీపీ నేతలు. ఇళ్లు నిర్మించేందుకు ఈ భూములు అనువుకాదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎకరం 7 లక్షల రూపాయలు ఉండే ప్రాంతంలో ఎకరం 45 లక్షల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆరోపించారు. భూముల్లో కోట్ల రూపాయల స్కాం జరిగిందంటూ ఆరోపించారు టీడీపీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com