కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డులకు ఏపీ సర్కారు ఫిర్యాదు

కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డులకు ఏపీ సర్కారు ఫిర్యాదు
X

తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి ప్రాజెక్టులు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మండిపడింది. ఈ మేరకు కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డు, గోదావరి నది మేనేజ్‌మెంట్ బోర్డులకు వైసీపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. జగన్ సర్కారు తరఫున ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్, KRMB, GRMBలకు వివరాలు అందించారు. మిగులు జలాలు ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం 5 కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని, ఇది విభజన చట్టానికి వ్యతిరేకమని ఏపీ సర్కారు పేర్కొంది. అపెక్స్ కౌన్సిల్, సీడబ్లూసీ, KRMB అనుమతి లేకుండానే ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రం గతంలోనే కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించలేదని విమర్శించింది.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జీఓ 203పై వివాదం చెలరేగుతున్న సమయంలో ఏపీ అధికారులు KRMB ఛైర్మన్‌ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా వాడుకున్న నీటి లెక్కలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల వివరాలను KRMB ఛైర్మన్‌కు అందించా రు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు-తాగు నీటి అవసరాల కోసం ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని ఏపీ అధికారులు KRMB ఛైర్మన్‌కు తెలిపారు. వాటాలకు మించి తెలంగాణ ప్రభుత్వం నీటిని వినియోగించుకోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులపై నిర్మాణంపై కేంద్రానికి, KRMB, GRMBలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై జీఓ 203ని సమర్దించుకున్న ఏపీ ప్రభుత్వం, శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల వద్ద నీటిని తీసుకెళ్లడానికి ఆస్కారముందని తెలిపింది. 881 అడుగుల వద్ద నీళ్లు సంవత్సరంలో 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాదిరిగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తాము చేపట్టామని వివరించింది.

Tags

Next Story