19 May 2020 8:39 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / గతేడాది అక్టోబర్‌...

గతేడాది అక్టోబర్‌ కన్నా ముందే కరోనా వ్యాప్తి.. చైనా భండారం బయటపెట్టిన క్రీడాకారులు!

గతేడాది అక్టోబర్‌ కన్నా ముందే కరోనా వ్యాప్తి.. చైనా భండారం బయటపెట్టిన క్రీడాకారులు!
X

నావెల్‌ కరోనా వైరస్‌ ఎప్పుడు ఆవిర్భవించింది? ఎవరికి ముందు సోకింది? ఇప్పటి వరకూ తెలియని విషయాలివి. డిసెంబర్‌లో వైరస్‌ వ్యాప్తి మొదలైందని చెబుతూ వస్తున్న చైనా.. మొదట అంటువ్యాధి కాదని యావత్‌ ప్రపంచాన్ని నమ్మించింది. కానీ ఆ తర్వాత అదే వ్యాధి క్రమంగా పెరుగుతూ వచ్చి... ప్రపంచ మహమ్మారిగా ప్రకటించాల్సి వచ్చింది. వాస్తవంగా వైరస్‌ జనవరిలో కాకుండా గతేడాది అక్టోబర్‌ కన్నా ముందే వ్యాప్తి చెందిందని కొందరు క్రీడాకారులు బయటపెట్టారు. వైరస్‌ జన్మస్థానమైన వుహాన్‌లో 2019, అక్టోబర్లో ప్రపంచ సైనిక క్రీడలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారుల్లో చాలామంది ఉన్నట్టుండి అస్వస్థత చెందారని, కొందరిలో కొవిడ్‌-19 లక్షణాలు కనిపించాయని తెలిసింది. తర్వాత పరీక్షిస్తే కొందరిలో పాజిటివ్‌ రావడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది! వంద దేశాల నుంచి దాదాపు 10వేల మంది ఈ క్రీడల్లో పాల్గొన్నారు.

ఫ్రెంచ్‌ పెంటాథ్లెట్‌ ఇలోడి క్లౌవెల్‌, తన భాగస్వామి వాలెంటిన్‌ బెలాడ్‌ కు కొవిడ్‌-19 సోకింది. వుహాన్‌లో తానున్న భవంతిలో అందరూ కొవిడ్‌-19 లక్షణాలతో అనారోగ్యం చెందారని ఇటాలియన్ ఫెన్సర్‌ టగ్లిలారియోల్‌ తెలిపారు. ఆ తర్వాత వైరస్‌ తన కుమారుడు, అతడి ప్రేయసికీ సోకిందని వాపోయారు. వీరీ విషయాలు బహిర్గతం చేసిన నేపథ్యంలో తనకు, తన జట్టు సభ్యులకు అక్టోబర్‌లోనే వైరస్‌ సోకిందని జర్మన్‌ వాలీబాల్‌ క్రీడాకారిణి జాక్వెలైన్‌ బాక్‌ వెల్లడించింది. క్రీడలు జరిగిన కొన్నాళ్లకు తన జట్టులో కొందరికి ఆరోగ్యం చెడిందని... రెండు రోజుల తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని చెప్పింది. తానెప్పుడూ ఇంతలా అనారోగ్యానికి గురవ్వలేదని. ఇది కొవిడ్‌-19 అనుకుంటున్నానని జాక్వెలైన్‌ తెలిపింది.

కొన్నాళ్ల క్రితం తనలో లక్షణాలు కనిపించాయని అది కరోనా వైరస్‌ అవునో కాదో తెలుసుకునేందుకు ఈ వారంలో యాంటీబాడీ టెస్టు చేయించుకుంటానని లక్సెంబర్గ్‌ ట్రయాథ్లెట్‌ ఒలీవర్‌ జార్జెస్‌ అన్నారు. వుహాన్‌లో తొలి కేసు డిసెంబర్లో నమోదైందని చైనా చెబుతున్నప్పటికీ అక్టోబర్‌లోనే ఆ నగర వీధులన్నీ నిర్జనంగా కనిపించాయని తెలిపారు. స్థానికులెవరూ బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించిందని వదంతులు వినిపించాయని వెల్లడించారు. అలాగే... అక్టోబర్లోనే వీధులన్నీ ద్రావకాలతో విపరీతంగా పిచికారీ చేయడం చూశామని తమ అథ్లెట్లు చెప్పారని జార్జెస్‌ అన్నారు. ఇప్పుడు చేస్తున్నట్లుగానే విమానాశ్రయంలో తన ఉష్ణోగ్రతను రికార్డు చేశారని.. చైనా క్రీడాకారులు క్యాంటీన్‌లో ప్రవేశించి పదేపదే చేతులు శుభ్రం చేసుకున్నారని తెలిపారు. అలాగే బయట నుంచి ఆహారం తీసుకోవద్దని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించిందన్నారు.

ఇలా అనేక దేశాల వారు ఒకే రకమైన ఆరోపణలు చేస్తుండడంతో... ప్రపంచ దేశాల ముందు చైనా భండారం బయటపడినట్లే అవుతోంది. అక్టోబరులోనే చైనాలో కరోనా ఉందని.. కావాలనే ఆ దేశం దాచిందంటూ అమెరికా చేసిన ఆరోపణలకు... క్రీడాకారులు చెబుతున్న మాటలు బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా అన్ని దేశాలు కరోనా పుట్టు పూర్వోత్తరాలను శోధించే పనిలో తల మునకలవడంతో.. ఇక చైనా అబద్ధాలు ఎంతో కాలం దాగవని తేలిపోతోంది.

Next Story