అంఫన్ ఎఫెక్ట్: అల్లకల్లోలంగా తీరం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ అంఫన్ తీవ్రత కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి, ఉత్తర బెంగాల్- బంగ్లాదేశ్ తీరాలైన డిగా, హతియా దీవుల మధ్య సుందర్ బన్ కు దగ్గర్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తోపాటు, ఒడిశా, బంగ్లాదేశ్ లలోని తీరప్రాంతాల్లో సముద్రం ఎగిసిపడుతోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్ తుఫాను బలహీనపడి, అత్యంత తీవ్ర తుఫానుగా మారింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయికి చేరడంతో వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తీర ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని సూచించింది. తుఫాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య ఈ రోజు మధ్యాహ్నానికి తుఫాను తీరం దాటనుంది. ఆ సమయంలో తీరం వెంబడి 165 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం అల్ల కల్లోలంగా మారింది. తీరం వెంబడి కెరటాలు ఎగసిపడుతున్నాయి. రాకాసి అలలు ఎగసిపడడంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మాయపట్నం వద్ద జియా ట్యూబ్ దాటుకుని సముద్రం నీరు ఇళ్లలోకి వచ్చింది. కాకినాడలోని సూరడపేట, మాయపట్నంలో కూడా సముద్రం కల్లోలంగా మారింది. కెరటాల దాటికి జియో ట్యూబ్ రాళ్లు ఊళ్ళో వచ్చి పడుతున్నాయి. తీరప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రం కావడంతో అధికారులు మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com