లాక్‌డౌన్‌ను అవినీతికి అనువుగా మార్చుకున్నారు: చంద్రబాబు

లాక్‌డౌన్‌ను కూడా అవినీతికి అనువుగా మార్చుకున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవుల నరికి వేస్తున్నారని ఆరోపించారు. నాసిరకం లిక్కర్‌తో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమే కాకుండా ఒకేసారి 70 శాతం పెంచారని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారని అన్నారు. ఎవరైనా ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే పగబట్టి కేసులతో వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోకుండా..రాష్ట్ర ప్రజలందరికీ వైరస్ వస్తుందని సీఎం చెప్పటాన్ని తప్పుబట్టారాయన. ఈ రాష్ట్రానికి జగన్ తానే మొదటి ముఖ్యమంత్రి.. చివరి ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల ఆస్తులను దోచుకునే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
లాక్‌డౌన్‌లో ప్రజలు ఉపాధి కొల్పోయి బాధపడుతుంటే.. ప్రభుత్వం కరెంట్ చార్జీలను పెంచటం దారుణమని అన్నారు చంద్రబాబు. తమ హాయాంలో సంస్కరణలు చేపట్టి.. విద్యుత్ కొరతను అధిగమించామని గుర్తు చేశారు. తమ పాలనలో ఒక్క పైసా కూడా పెంచలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఏపీకి పెట్టుబడులే రాకుండా పోయాయని అన్నారాయన. ఏపీ ప్రభుత్వ తీరుతోనే కేంద్రం విద్యుత్ రంగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com