గాంధీలో కరోనాతో మరణించిన వ్యక్తి డెడ్ బాడీ మాయమైందా ?

గాంధీలో కరోనాతో మరణించిన వ్యక్తి డెడ్ బాడీ మాయమైందా ?

కరోనాతో మరణించిన వ్యక్తి డెడ్‌బాడీ మాయమైందా? కుటుంబసభ్యులకు చెప్పకుండానే అంత్యక్రియలు చేసేశారా? గాంధీ ఆసుపత్రిలో ఇంత పెద్ద గల్తీ ఎలా జరిగింది? దీనికి అధికారులు చెప్తున్న సమాధానం ఏంటి? ఈ వ్యవహారం మృతుడి భార్య మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంకు చెందిన ఓ కుటుంబం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది. వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. అందులో 42 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 30న గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. తన భర్త కండీషన్ ఎలా ఉందో, అతడు ఎక్కడున్నాడో తెలియక అతడి భార్య తల్లడిల్లింది. చివరికి తన భర్త గాంధీ ఆసుపత్రి నుంచి మిస్సయ్యాడంటూ మంత్రి కేటీఆర్‌కు ఆమె ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావును వివరణ అడిగారు. అయితే ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరిన 23 గంటల్లోనే చనిపోయాడని.. ఆ వెంటనే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని చెప్పడంతో మృతుడి కుటుంబసభ్యులు షాకయ్యారు.

అంతా కొవిడ్ నిబంధనల ప్రకారమే జరిగిందని సూపరింటెండెంట్ రాజారావు చెప్పారు. ఏప్రిల్ 30 ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి కండీషన్ సీరియస్‌గా మారిందన్నారు. బతికించడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారని చెప్పారు. కానీ ఊపిరితిత్తుల్లో న్యుమోనియా కంట్రోల్ కాకపోవడంతో మే 1న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు చనిపోయినట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. అయితే నిబంధనల ప్రకారం కుటుంబసభ్యులకు చెప్పిన తర్వాతే పోలీసులకు డెడ్‌బాడీని అప్పగించామన్నారు. కుటుంబసభ్యుల నుంచి తీసుకున్న సంతకాలు కూడా తమ రికార్డ్స్‌లో ఉన్నాయన్నారు. అంతేగానీ తమ నిర్లక్ష్యం ఏమీ లేదని రాజారావు చెప్పారు.

భర్త చివరి చూపు కూడా దక్కలేదని.. అనాథ శవంలా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు చేయడాన్ని తలచుకుని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. మరో విషాదం ఏంటంటే ఆమె భర్త చనిపోయిన కొన్ని రోజులకే ఆమె మామ కూడా కరోనా కాటుకు బలయ్యాడు. అయితే మామ డెడ్ బాడీని అత్తకు అప్పగించారని.. అలాంటప్పుడు తన భర్త మృతదేహాన్ని తనకు ఎందుకు అప్పగించలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై ఆమె మండిపడుతున్నారు. కానీ తమ డాక్టర్లు, సిబ్బంది కరోనా రోగులను కాపాడడానికి నిరంతరం కృషిచేస్తున్నారని, అలాంటప్పుడు తమను నిందించడం సరికాదంటున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు. ఇక్కడ తప్పు ఎవరిదైనా మృతుడి భార్యకు, మిగతా కుటుంబసభ్యులకు ఇది తీరని శోకమే.

Tags

Next Story