కోరలు చాస్తోన్న కరోనా.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

కోరలు చాస్తోన్న కరోనా.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

కరోనా మరింత కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 24 గంటల్లోనే లక్ష కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. మహమ్మారి ఎప్పుడు తగ్గిపోతుందా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. తగ్గడం మాట దేవుడుడెరుగు... ఇంకా ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ పిశాచి ప్రపంచానికి సవాలు విసురుతూనే ఉంది. మంగళవారం నుంచి బుధవారం మధ్య 24 గంటల్లో లక్షా ఆరు వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటిదాకా అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. ఇందులో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 46 వేలు. ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తర్వాత 20 లక్షల 43 వేల మందికి పైగా వ్యాధి నుంచి బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొవిడ్‌-19 కారణంగా 3 లక్షల 32 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు.

ఇక అమెరికా, రష్యాలో ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్ వంటి దేశాల్లో పరిస్థితులు విషమంగా మారాయి. ఈ మహమ్మారి ఇంకా ఎంతమందిపై దాడి చేస్తుందోనని ప్రపంచానికి టెన్షన్ పట్టుకుంది.

కొవిడ్‌-19 కారణంగా అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. గంటల్లో అమెరికాలో మొత్తంగా 96 వేల మంది మరణించారు. బ్రిటన్‌లో 36 వేలు, ఇటలీలో 33 వేలు, ఫ్రాన్స్‌లో 29 వేలు, స్పెయిన్‌లో 19 వేల మంది ప్రాణాలు కోల్పో యారు. నెదర్లాండ్స్, కెనెడా, మెక్సికో, ఇరాన్, జర్మనీ, బెల్జియంలలో 5 వేల నుంచి 10 వేల మంది మృతి చెందారు.

ఇక, చైనాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా వైరస్ ఉద్భవించిన వూహాన్ సిటీలో రెండోదశ వైరస్ వ్యాప్తి చెందుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఒక్కరోజే 33 కేసులు వెలుగుచూశాయి. వూహాన్‌లో 28, గాంగ్‌డాంగ్ ప్రావిన్స్, షాంఘైలలో ఒక్కొక్కటి చొప్పున కేసులు బయటపడ్డాయి. వైరస్ మళ్లీ వ్యాపిస్తుండడంతో వూహాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో ముందుజాగ్రత్త చర్యగా కోటి 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన రోగులను క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story