దగ్గు, జలుబు అని క్లినిక్‌కి వెళ్తే కరోనా.. వెలుగులోకి వచ్చిన మరో నిజం

ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి వెళ్తే కొత్త జబ్బులు కొని తెచ్చుకున్నట్లే ఉంది. నిజంగానే దవాఖానాలు.. అందులోనూ చిన్న చిన్న క్లినిక్‌ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రులు మినహాయించి.. సర్కారు దవాఖానాలు, వీధి చివరన ఉండే చిన్నా చితకా ఆస్పత్రుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది. రోగుల రద్దీ ఎక్కువగా ఉండడం.. ఎవరు ఏ అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చారో తెలియకపోవడం ఇవన్నీ కరోనా వైరస్ వ్యాప్తికి కారణాలవుతున్నాయన్న విషయం జీహెచ్ఎంసీ దృష్టికి వచ్చింది.
వైరస్ వ్యాప్తి తగ్గుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకి కేసులు పెరగడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆ దిశగా దృష్టి సారించారు అధికారులు. తాజాగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఓ కుటుంబంలో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. వైరస్ ఎలా సోకిందని ఆరా తీశారు అధికారులు. స్థానికంగా ఉన్న క్లినిక్‌కు వెళ్లారు కుటుంబంలోని ఓ వ్యక్తి ఆరోగ్యం బాగాలేదని. మలక్‌పేట లోని మరో వ్యక్తి కూడా ఇలానే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లారు. ఈ రెండు కేసుల్లో వైరస్ వ్యాప్తి స్థానికంగా ఉండే క్లినిక్‌ల ద్వారానే జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
నగరంలో వేల సంఖ్యలో బస్తీలు, కాలనీల్లో క్లీనిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి వారెలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది తెలుసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను బట్టి క్లినిక్‌లను మూసి వేస్తున్నాని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ ఉన్నప్పటికీ చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో క్లినిక్‌లను మూసి వేస్తున్నామని జీహెచ్‌ఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హేమలత తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com