ఏపిలో అధికారపార్టీ కార్యకర్తల ఆగడాలు

ఏపిలో అధికారపార్టీ కార్యకర్తల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అడ్డూ అదుపులు లేకుండా అక్రమాలకు పాల్పడుతూ తమ హవా కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా అచ్చం పేట మండలం కోనూరు గ్రామంలోని దళితుల లంక భూములపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. దీంతో రెవెన్యూ, మైనింగ్ అధికారుల సహాకారంతో ఆక్రమణకు పన్నాగం పన్నారు. కోనూరు గ్రామంలో కృష్ణా నది మధ్యలో లంకభూములు... సర్వేనెంబర్ 280/2, 331/c లలోని 250 ఎకరాలను బ్రిటీష్ వారు 1923లో దళితులకు అందజేశారు. 1996-98మధ్యంలో అచ్చంపేట తహాసీల్దార్ పట్టాలను కూడా అందజేశారు. గతంలో ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుచేసి అనేక సార్లు లోన్లు తీకున్నారు.
ఈ లంకభూములు పంటల సాగుకు ఉపయోగపడవు. ఈ భూముల్లో ఇసుక మేటలు వేస్తుంది కనుక పంట సాగుకు అనుకూలంగా ఉండదు. నది మధ్యలో ఉండే ఈ భూమికి చేరుకోవాలంటే కొంత తూరం నది నీటిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల పట్టాభూములల్లో ప్రభుత్వం ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తుండటంతో.... అధికారపార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కయ్యారు. తమకు పట్టా భూములు ఉన్నాయని, ఇసుక తరలించేందుకు అనుమతి కోసం మైనింగ్ రెవెన్యూ అధికారులతో సర్వే ప్రారంభించారు. దీంతో అక్కడికి చేరుకున్న దళితులు ఆందోళనకు దిగారు. నకిలీ పట్టాదారు పాసు బుక్కులతో ఈ భూమి కాజేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ భూములు కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక కర్నూలు జిల్లాలో స్థానిక వైసీపి కార్యకర్తలు రెచ్చిపోయారు. జండా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలపై దాడులకు దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కౌతాళం మండలం ఉరుకుందు లలో బీజేపీ జండా కట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా... వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త నాగరాజు స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికిచేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే తమపై దాడికి పాల్పడ్డ వైసీపి వారిని అరెస్టు చేయాలని నియోజకవర్గ ఇన్ ఛార్జ్, హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి ధర్నాకు దిగారు.
రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయన్నారు బీజేపీ నేతలు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టుచేయాలని వారు డిమాండ్ చేశారు. దాడిచేసినవారిపై చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామి ఇవ్వడంతో బీజేపీ నేతలు ధర్నా విరమించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com