మధుసూదన్ బ్రతికున్నాడా? లేదా?: టీఎస్ హైకోర్టు

మధుసూదన్ బ్రతికున్నాడా? లేదా?: టీఎస్ హైకోర్టు
X

గాంధీలో మృతిచెందిన కరోనా పేషెంట్ అంత్యక్రియల వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. తన భర్త మధుసూదన్ ఆచూకీ తెలపాలంటూ కోర్టును ఆశ్రయించారు మాధవి. తన భర్తకు కరోనా వచ్చిందంటూ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారని కానీ ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు మాధవి. అసలు మధుసూదన్ బతికున్నాడా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. దీంతో అతడు కరోనాతో చనిపోయాడని అడ్వకేట్ జనరల్ తెలిపారు. మరి మృతి చెందినప్పుడు డెత్‌ సర్టిఫికేట్‌ ఎందుకు ఇవ్వలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. కనీసం కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగింది.. రేపటి లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తన భర్త మిస్సయ్యాడంటూ.. అప్పట్లో మాధవి మంత్రి కేటీఆర్‌కు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ కూడా స్పందించారు. ఆ కుటుంబంలో అప్పటికే మాధవి మామగారు ఈశ్వరయ్య కరోనాతో చనిపోయారని.. ఆ మరుసటి రోజే భర్త మధుసూదన్ కూడా మృతిచెందారని చెప్పారు. అప్పటికే కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో వున్న ఆ కుటుంబానికి ఈ వార్త తెలిస్తే మరింత ఆందోళనకు గురవుతారని.. మృతి విషయం చెప్పలేదని తెలిపారు. ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు.. ఇప్పుడీ వివాదం హైకోర్టుకు చేరింది.

Tags

Next Story