కేజ్రీవాల్‌కి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు

కేజ్రీవాల్‌కి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 24 గంటల్లో ఫలితాలు రానున్నాయి. ఆదివారం నుంచి గొంతునొప్పి, జ్వరంతో బాధ పడుతున్నారాయన. దీంతో సమావేశాలన్నీ రద్దు చేసుకొని ఇప్పటికే హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు కేజ్రీవాల్. ఇటీవల కేజ్రీవాల్ పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. సచివాలయానికి వెళ్లి సమావేశాలు నిర్వహించారు. ఆదివారం తన అధికారిక నివాసంలో మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించారు. అనంతరం ఆన్‌లైన్‌లో మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ తర్వాత గొంతు నొప్పి తీవ్రంకావడం.. జ్వరం కూడా రావడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు.

ఢిల్లీలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. గంటగంటకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరింది. 874 మంది మృతిచెందారు. అటు దేశ రాజధానిలోని ఆసుపత్రుల్లో కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే కరోనా చికిత్సను అందించాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆదేశాలివ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలని, అసలు దిల్లీవాసులంటే ఎవరో చెప్పాలని పలు పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. అయితే కేజ్రీవాల్ ఆదేశాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ రద్దుచేశారు. జీవించే హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో స్పష్టంచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎలాంటి వివక్ష లేకుండా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బయటివారికి కూడా కొవిడ్‌ చికిత్స అందించాలని ఆదేశించారు. దిల్లీ నివాసి కాదన్న కారణంతో ఎవరికీ వైద్యసేవలను నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కరోనా పరీక్షలు చేయాలన్న ఆప్‌ ప్రభుత్వ ఆదేశాలనూ ఎల్జీ రద్దు చేశారు. ఇది ICMR మార్గదర్శకాలకు విరుద్ధమని, లక్షణాలు లేకపోయినా కరోనా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. తాజా పరిణామాలోతో లెఫ్టినెంట్ గవర్నర్-ఆప్‌ సర్కారు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

ఢిల్లీ ఆసుపత్రుల్లో అందరికీ వైద్యం అందించాలని ఎల్జీ నిర్ణయించడంపై కేజ్రీవాల్‌ స్పందించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయం వల్ల ఢిల్లీ వాసులకు పెద్దకష్టం తప్పదన్నారు. అందరికీ వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామంటూ ట్వీట్‌ చేశారు. తమ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేలా LGపై ఒత్తిడి తెచ్చి బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆప్‌ నేతలు విమర్శించారు.

Tags

Next Story