భారత్‌లో రోజుకు 10 వేల చొప్పున కరోనా కేసులు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌లో రోజుకు 10 వేల చొప్పున కరోనా కేసులు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో కరోనా కల్లోలం రేపుతుంటే మనదేశంలో కరోనా కంట్రోల్‌లోనే ఉందని సంబరపడ్డారు. లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేశామని ఆనందపడ్డారు. పరిస్థితి అదుపులోనే ఉందనుకుంటూ లాక్‌డౌన్‌ను కూడా సడలించేశారు. జూన్‌లో ఇంకా ముందుకెళ్లి అన్‌లాక్-1 కూడా అమలు చేస్తున్నారు. ఐతే, మే వరకు అదుపులోనే ఉన్నట్లు కనిపించిన కరోనా, మే రెండో వారం నుంచి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టింది. వారానికి 50 వేల చొప్పున కేసులు నమోదయ్యాయి. జూన్‌లో పరిస్థితి మరింత భయానకంగా మారింది. వారానికి 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపులతో ప్రారంభమైన కరోనా వ్యాప్తి అన్‌లాక్‌-1తో జోరందుకుంది. జూన్ 8 నుంచి దాదాపు అన్ని రంగాలకు మినహాయింపులు రావడం, ప్రజా రవాణా వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కావడంతో వైరస్ ట్రాన్స్‌మిషన్ జెట్ స్పీడ్‌లా పరుగెడుతోంది. ప్రస్తుతం రోజుకు 10 వేల చొప్పున కేసులు వస్తున్నాయి. ఇకపై రోజుకు 15 వేల కేసులు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయాలంటే మళ్లీ లాక్‌డౌన్ విధించడమొక్కటే శరణ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ పరీక్షలు చేస్తే చైనా, భారత్‌లలో కరోనా కేసులు ఎక్కువగా బయటికి వస్తాయి అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో రెండున్నర కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చైనాలో ఎంతమందిని పరీక్షించారో అధికారిక లెక్కలు లేవు. మనదేశంలో దాదాపు 50 లక్షల పరీక్షలు జరిగాయి. అమెరికాతో పోలిస్తే మనదగ్గర జరిగిన పరీక్షల సంఖ్య చాలా తక్కువ. పైగా, కొన్ని రాష్ట్రాల్లో లక్షణాలు బయటపడిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సెకండ్, థర్ట్ కాంటాక్ట్ కేసులను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. అదే జరిగితే కేసుల సంఖ్యలో మనదేశం, అమెరికాను మించిపోతుందని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే తప్పేమీ ఉండదని అంటున్నారు.

మనదేశ జనాభా దాదాపు 135 కోట్లు. ఇక్కడ కరోనా మహమ్మారి అంటువ్యాధిలా విజృంభిస్తే తట్టుకోవడం చాలా కష్టం. అసలే మనదేశంలో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రం. లక్షలాదిమందికి కరోనా సోకితే ట్రీట్‌మెంట్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాల్లోని కరోనా ఆస్పత్రులు పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరణమృదంగం మో గిస్తోంది. చైనా మొత్తమ్మీద ఎన్ని కేసులు వచ్చాయో ఒక్క మహారాష్ట్రలోనే అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. తమిళనాడు, ఢిల్లీల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇలాంటి సమయం లో ప్రజలంతా పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వస్తున్నారు. రకరకాల కారణాలతో ప్రజలు వీధుల్లో తిరుగుతున్నారు. ఇది చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ విశృంఖలంగా మారడానికి ఇలాంటివే కారణమవుతాయని చెబుతున్నారు. ఢిల్లీలో జూలై నెలాఖరుకు ఐదున్నర లక్షల కేసులు వస్తాయని స్వయంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. ఢిల్లీలోనే ఆ పరిస్థితి ఉంటే వైరస్ విశృంఖలంగా విజృంభిస్తున్న మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లదీ అదే సిచ్యువేషన్. దేశంలో రోజుకు వేలాది కే సులు వస్తే తట్టుకునే కెపాసిటీ దేశానికి లేదని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరో 2 వారాల తర్వాత లాక్‌డౌన్ ప్రకటించే అవకాశముందని ఢిల్లీ మీడియా సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. ఐతే, ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. పైగా వలస కూలీలు, రా ష్ట్రాలకు ఆర్థికసాయంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదీగాక ఇప్పుడిప్పుడే వ్యవస్థ కొద్ది కొద్దిగా గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

Tags

Next Story