వాలంటీర్లను సొంత పనులకు వాడుకుంటున్న వైసీపీనేత

ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కానీ వాళ్లను తమ ఇంటి పనిమనుషుల కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అనంతపురం జిల్లా దయ్యాలకుంటపల్లిలో జరిగిన ఘటన వైసీపీ నేతల అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ఇక్కడ చంద్రలేఖ వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలు శివారెడ్డి, కాటమయ్య ఆమెను ఘోరంగా అవమానించారు. లాక్‌డౌన్ కారణంగా షేవింగ్ చేసుకోలేదని.. షాప్ దగ్గరికి వెళ్లి.. క్షురకులు ఉన్నారో లేదో చూసి రమ్మంటూ హుకూం జారీ చేశారు. ఇది నా విధుల్లో భాగం కాదంటూ చెప్పింది చంద్రలేఖ. తాము చెప్పిన పనిచేయాల్సిందేనని లేదంటూ జాబ్ ఉండదంటూ హెచ్చరించారు.
తనను ఎందుకిలా వేధిస్తున్నారంటూ వైసీపీ నేతల్ని పశ్నించింది వాలంటీర్ చంద్రలేఖ. తమకే ఎదురుతిరుగుతావా అంటూ.. ఉన్నతాధికారుల నుంచి ఆమెకు షోకాజు నోటీసు ఇప్పించారు. 2 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వకపోతే ఉద్యోగం లోంచి తొలగిస్తామంటూ నోటీసులు వచ్చాయి. ఇదెక్కడి అన్యాయమంటూ చంద్రలేఖ ఆమె తల్లి.. వైసీపీ నేతల్ని నిలదీశారు. దీంతో ఆ ఇద్దరిపై దాడికిపాల్పడ్డారు. చివరకు బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. వైసీపీ నేతల నుంచి కూడా ఫిర్యాదు వచ్చిందని.. ఏం జరిగిందో విచారించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు.
విషయం పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లడంతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు వైసీపీ నేతలు. కేసులు వద్దంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

