తెలంగాణలో 4వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 4వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 191 కేసులు నిర్ధారణ అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4111కు చేరింది. తాజాగా తెలంగాణలో కరోనాతో 8 మంది మరణించారు.. మొత్తం మరణాల సంఖ్య 156కి చేరింది.. ఇప్పటి వరకు 1817 మందిని డిశ్చార్జ్‌ చేయగా, 2138 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ భాగం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 143 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చల్‌ జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.. సంగారెడ్డి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.. మహబూబ్‌నగర్‌లో నాలుగు, మెదక్‌లో మూడు కేసులు నమోదు కాగా.. జగిత్యాలలో మూడు, నాగర్‌ కర్నూల్‌, కరీంనగర్‌లో రెండేసి కేసులు నమోదయ్యాయి.. నిజామాబాద్‌, వికారాబాద్‌, నల్గొండ, సిద్దిపేటలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇక జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ కరోనా కేసుల అలజడి మొదలైంది.. తాజాగా మరో కరోనా కేసు వెలుగు చూసింది.. మేయర్‌ పేషీలో పనిచేసే ఓఅటెండర్‌కు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.. దీంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని శానిటైజ్‌ చేశారు సిబ్బంది. బల్దియా కార్యాలయంలో ఇప్పటి వరకు మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. గతంలో పాజిటివ్‌ వచ్చిన సెక్షన్‌ సిబ్బందికి ఈరోజు సరోజినీ దేవి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు.

లాక్‌ డౌన్‌ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గత నెల 16 నుంచి లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం కొద్దికొద్దిగా సడలిస్తూ వచ్చింది.. ఈ నేపథ్యంలో జనం బయట తిరిగేందుకు వెసులుబాటు లభించింది.. అటు వలస కార్మికులతోపాటు అంతర్‌ జిల్లాల బస్సు సర్వీసులు కూడా పెరగడంతో జిల్లాల్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.. గతంలో ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మాస్కులు లేకుండా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నా జనం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కరోనా బారిన పడకుండా కేంద్రం సూచించిన నిబంధనలను పాటించకపోవడం వల్లే వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

Tags

Next Story