దేశంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువ

దేశంలో కరోనా బెంబేలెత్తిస్తోంది. రోజుకు దాదాపు 10 వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లోనే 70 వేలకు పైగా కేసులు వచ్చాయి. దాదాపు 2 వేల మంది చనిపోయారు. ఇప్పటి వరకు 2 లక్షల 78 వేల మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 7, 755 మంది వైరస్‌తో చనిపోయారు. కొవిడ్-19 బారిన పడి ఆరోగ్యం విషమంగా ఉన్న కేసుల సంఖ్య మనదేశంలో ఎక్కువగా ఉంది. ఈ విషయంలో మనదేశం రెండోస్థానంలో ఉంది. అత్యధికకంగా అమెరికాలో ఎక్కువమంది ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది. భారత్ కంటే బ్రెజిల్‌లో కేసులు 3 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ విషమ స్థితిలో ఉన్నవారి సంఖ్య భారత్ కంటే తక్కువే. రష్యాలో సీరియస్ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతు మాత్రమే. పెరుగుతున్న మరణాలు, సీరియస్ కండిషన్‌లో ఉన్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళనను పెంచుతోంది.
ముంబై, ఢిల్లీల్లో కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. బాంబేలో కరోనా కేసుల సంఖ్య వూహాన్‌ను దాటేసింది. ఒక్క ముంబైలోనే 50 వేలకు పైగా కేసులున్నాయి. బాధితుల సంఖ్య విపరీతంగా ఉండడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఐసీయూలు పూర్తిగా నిండిపోయాయి. ఒక బెడ్‌పై ఇద్దరు-ముగ్గురికి చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి. ఆస్పత్రుల్లో రోగు లకు సరిపడా బెడ్లుగానీ, వెంటిలేటర్లు గానీ అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతానికి ఢిల్లీలో 8,821 హాస్టల్ పడకలు, 582 ఐసీయు పడకలు, 468 వెంటిలేటర్ పడకలు, 3,590 ఆక్సిజన్ ఆధారిత పడకలు ఉన్నాయి. వీటిని కరోనా బాధితులకు కేటాయించగా సగానికి పైగా నిండిపోయాయి. పైగా, ఈ నెలాఖరువరకు లక్ష కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే పేషంట్లకు చికిత్స అందించడం కష్టసాధ్యమవుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, హోటళ్లను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని నిర్ణయించారు.
వీటిలో స్పెషల్ బెడ్ ఖర్చు రోజుకు 10 వేల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం. ఇందులోనే ఆహారం, వైద్య చికిత్స, మెయింటనెన్స్ మొదలైనవి అందించనున్నారు. ఇప్పటివరకు 8 హాస్పి టళ్లు, హోటళ్ళు సిద్ధం చేశారు. త్వరలో మరో 19 హాస్పిటళ్లు సిద్ధం కానున్నాయి. వీటికితోడు ప్రగతి మైదానం, టాకటోరా స్టేడియం, ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం, జెఎల్‌ఎన్ స్టేడియం, ధ్యాన్‌చంద్ స్టేడియంలను కూడా మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నప్పటికీ ఊరట కలిగించే విషయాలు కూడా బయటపడుతున్నాయి. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోం ది. యాక్టివ్ కేసుల కంటే కూడా రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు యాక్టివ్ కేసులను మించిపోవడం ఇదే తొలిసారి. దాదాపు 50 శాతానికి పైగా బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. రాబోయే రోజుల్లో రికవరీ రేటు ఇంకా పెరుగుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

