ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వైరస్‌ బాధితుల సంఖ్య ఏకంగా 75 లక్షలకు చేరింది. 4 లక్షల 20 వేల మంది కరోనాతో మృతి చెందారు. అమెరికా, బ్రెజిల్, రష్యాల్లో మహ మ్మారి విజృంభిస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో 20 వేల 850 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 లక్షల 67 వేలకు చేరింది. అమెరికా తర్వాత బ్రెజిల్‌లో కరోనా ప్రభావం తారాస్థాయిలో ఉంది. బ్రెజిల్‌లో 7 లక్షల 76 వేల మంది కరోనా బాధితులున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 33 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు 13 వందల మంది చనిపో యారు. దాంతో మృతుల సంఖ్య 40 వేలకు చేరింది. మృతుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. ఒకే రోజు 33 వేల కేసులు, 13 వందల మరణాలు నమోదు కావడంతో బ్రెజిల్ ప్రజలు వణికిపోతున్నారు. అమెరికా, బ్రెజిల్ తర్వాత రష్యాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. రష్యాలో కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 6 వేల 5 వందలకు పెరిగింది. రష్యా లో రోజుకు 10 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉన్నప్పటికీ లాక్‌డౌన్ సడలించారు. మాస్కోలో మళ్లీ వర్తక వాణిజ్యాలు ప్రారంభమయ్యాయి.

అమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఈ ఒక్క దేశంలోనే లక్ష 16 వేల మంది చనిపోయారు. మరో రెండు నెలల్లో మరో లక్ష మంది చనిపోతారని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి అమెరికాలో కరోనా కారణంగా 2 లక్షల మందికి పైగా చనిపోయే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఆంక్షలను సడలించడం వల్ల అమెరికాలో కరోనా కేసులు 20 లక్షలు దాటాయని సర్వేలు పేర్కొన్నాయి. కఠినమైన చర్యలు పాటించకపోతే సెప్టెంబర్ నాటికి మరణాల సంఖ్య 2 లక్షలకు చేరుతుందని అభిప్రాయపడ్డారు. న్యూ మెక్సికో, ఉటా, ఆరిజోనాల్లో గత వారంతో పోలిస్తే ఈ వారం 40 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఫ్లోరిడా, అర్కాన్సాస్ ప్రాంతాలు కరోనా హాట్ స్పాట్స్‌గా మారాయి. రాబోయే రోజుల్లో అమెరికాలో కరోనా విజృంభణ ఇంకా పెరిగి పోతుందని నివేదికలు చెబుతున్నాయి. పైగా, సెప్టెంబర్‌ నాటికి కరోనా మహమ్మారి తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదని సర్వేలు పేర్కొంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం వంటి నియమాలను కఠినంగా పాటించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని సర్వేలు అభిప్రాయపడ్డాయి.

అమెరికాలో వైరస్‌ సంక్రమణ రేటు బ్రెజిల్‌తో పోలిస్తే మూడు రేట్లు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రపంచదేశాలతో పోలిస్తే, అమెరికాలోనే అత్యధిక స్థాయిలో వైరస్‌ టెస్టింగ్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఆ దేశంలో ఐదున్నర లక్షల మేర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో రోజుకు సగటును 20 వేల కేసులు నమోదవుతున్నాయి. 21 రాష్ట్రాల్లో వైరస్‌ సంక్రమణ జోరుగానే కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తున్న తీరు ఆ దేశ ప్రజల్లో కొంత ఆందోళన క్రియేట్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story