ఇది ప్రజాస్వామ్యమా? డిక్టేటర్ల రాజ్యమా?: టీ కాంగ్రెస్

ఇది ప్రజాస్వామ్యమా? డిక్టేటర్ల రాజ్యమా?: టీ కాంగ్రెస్

పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించిదుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. గోదావరి జలదీక్షలకు పిలుపునిచ్చింది. అయితే, జలదీక్షల్లో పాల్గొనేందుకు వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో గందరగోళం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జలదీక్షలో పాల్గొనేందుకు వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వంపై పొన్న ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చినమాట ప్రకారం ఎగువ మానేరును అక్టోబర్ వరకు పూర్తి చేయాలని, లేదా కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలో ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడాని వస్తే.. అరెస్ట్‌ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను సందర్శించినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదన్నారు. కేవలం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమయ్యేలా చూసేందుకే ప్రాజెక్టులు సందర్శిస్తున్నామని అన్నారు.

అటు జలదీక్షలో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వెళ్తున్న.. కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లను అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జలదీక్షను అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? లేక డిక్టేటర్ల రాజ్యమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌లపై న్యాయస్థానాన్నిఆశ్రయిస్తామని అన్నారు.

Tags

Next Story