హైదరాబాద్ లో తగ్గని కరోనా.. నిర్లక్ష్యమే ప్రధాన కారణమా..

హైదరాబాద్ లో తగ్గని కరోనా.. నిర్లక్ష్యమే ప్రధాన కారణమా..

కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందే అన్న మాటను అక్షరాలా ఆచరిస్తున్నారేమో హైదరాబాద్ నగర వాసులు. అందుకే కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బుధవారం రికార్డు స్థాయిలో 214 కేసులు నమోదయ్యాయని వైద్య శాఖ ప్రకటించింది. ఈ నెలలో కరోనా కేసుల సంఖ్య చూస్తే.. 6వ తేదీన 152 మందికి, 11వ తేదీన 175 మందికి, 13న 179 మందికిచ 14న 195 మందికి కరోనా సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత నెలలో అత్యధికంగా నమోదైన కరోనా కేసులు ఈ నెలలో మరింతగా విజృంభిస్తోంది. అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి ముదుసలి వరకు ఎవరైనా కరోనా బారిన పడుతున్నారు.

నగరంలో కరోనా తీవ్రత పెరుగుతున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు.. భౌతిక దూరం పాటించట్లేదు.. మాస్కులు ధరించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తికి దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వైద్య సిబ్బంది సైతం కరోనా బారిన పడడం విషాదకరం. కరోనా బాధితులకు సేవ చేస్తూ వారూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కింగ్ కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. నిమ్స్ లో 40 మంది మెడికల్ సిబ్బందికి, 26 మంది డాక్టర్లకు కరోనా సోకింది. వారంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు పోలీస్ కానిస్టేబుళ్లను కరోనా మహమ్మారి విడిచి పెట్టట్లేదు.. వారితో పాటు వారి కుటుంబాలు కరోనా బారిన పడుతున్నారు.

నగరంలో కరోనా కేసుల ప్రాంతాలు.. అంబర్ పేటలో ఐదుగురికి, కుత్బుల్లాపూర్ లో నలుగురికి, గాంధీ ఆస్పత్రిలో శానిటైజ్ వర్కర్ కి, వారాసిగూడలోని వృద్ధుడికి, నేరేడ్ మెట్ లో ముగ్గురికి, రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ పరిధిలోని ఒకరకి, హసన్ నగర్ ఇమాద్ నగర్ లో ఒకరికి, కాటేదాన్ స్వప్న థియేటర్ ప్రాంతంలో ఒకరు, రామాంతపూర్ లో నలుగురికి, హబ్సిగూడలో ఇద్దరికి, ఖైరతాబాద్ లో ఇద్దరికి, బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని మాజీ సర్పంచ్ కు, బేగంపేటలో పాలు సరఫరా చేసే వ్యక్తికి, ఇంకా చాలా ప్రాంతాల్లో కరోనా సోకిన కేసులు వెలుగు చూస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story