14 రోజులు లాక్డౌన్.. కేసులు పెరగడంతో..

రెండు నెలలు లాక్డౌన్ విధించి వైరస్ వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగారు. మళ్లీ ఇప్పుడు లాక్డౌన్ అనంతరం కేసులు ఎక్కువవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆదివారం నుంచి నగరంలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు కానుంది. నగరంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడం, అనుమానితులు వందల సంఖ్యలో ఉండడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి అని అధికారులు వివరించారు. తాజా సమాచారం ప్రకారం జిల్లాలో 268 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలు పట్టణంలో కరోనా విజృంభిస్తుండడంతో తొలిసారిగా 13 కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 3వ తేదీనుంచి ఈ రోజు వరకు 30 కరోనా కేసులు నమోదవగా.. కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యుల్లో కూడా కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న పట్టణ ప్రజలు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖానికి మాస్కులు పెట్టుకోవట్లేదు.. సామాజిక దూరాన్ని అసలుకే పాటించట్లేదు.. ఎక్కడ చూసిన గుంపులు గుంపులుగా జనం రోడ్ల మీద కనిపిస్తున్నారు. వారి నిర్లక్ష్యమే మరోసారి లాక్డౌన్ కి దారి తీసిందని అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com