ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. చైనా దుస్సాహసాలు చేస్తుంది: అమెరికా

భారత్ పట్ల చైనా అనుసరిస్తున్న తీరుపై అమెరికా తీవ్రంగా మండిపడింది. చైనా దుస్సాహసాలకు పాల్పడుతోందని ఫైర్ అయింది. భారత సరిహద్దుల్లో చైనా కుట్రలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గతంలో డోక్లాంలోనూ చైనా ఇదే రకంగా కుట్రలకు పాల్పడిందని విదేశాంగ శాఖ ఉన్నతాధికారి డేవిడ్ ఫ్టిల్‌వెల్ అన్నారు. చైనా ఆర్మీ వివాదాస్పద ప్రాంతంలో చాలా లోపలికి చొరబడిందన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారీగా సైన్యాన్ని మోహరించిందని ఆయన చెప్పారు. చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసంగానీ వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగానే ఇలా చేసి ఉండొచ్చని స్లిల్‌వెల్ అన్నారు.
చైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని డ్రాగన్ కంట్రీపై అమెరికా మండిపడింది. ప్రపంచం మొత్తం కరోనాతో సతమతమవుతుంటే ఇదే అదనుగా భావించి చైనా కుయుక్తులకు ఒడిగడుతున్నట్లు ఆయన చెప్పారు. కానీ పొరుగుదేశాలతో చైనా దూకుడుగా ప్రవర్తించడంపై అమెరికా తన వైఖరిని మాత్రం ప్రకటించలేదు. మరోవైపు చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికుల మరణం పట్ల అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో సంతాపం ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com