ఆకాశంలో అద్భుతం.. పూర్తిస్థాయిలో ఏర్పడ్డ వలయాకార సూర్యగ్రహణం

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9 గంటల 16 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. మనదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో తొలుత కనిపించింది. తెలంగాణలో ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 44 నిమిషాల వరకు 51 శాతం గ్రహణం కనిపిస్తుంది.
మనదేశంలోని జోషీమఠ్, దేహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో సూర్యగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. హైదరాబాద్‌తోపాటు మిగతా చోట్ల పాక్షికంగానే ఉంటుంది. సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల గుండా చూడడం ప్రమాదకరమన్నారు నిపుణులు. వైద్యులు సూచించిన ఎక్లిప్స్ అద్దాలతోనే గ్రహణాన్ని చూడాలని సూచించారు.
సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం రాత్రి మూసివేశారు. స్వామివారి కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం శ్రీవారి గర్భాలయాన్ని, మహాద్వారాన్ని మూసివేశారు. ఆదివారం భక్తులకు దర్శనం రద్దు చేశారు. కరోనా నుంచి మానవాళిని రక్షించాలని శ్రీవారి పుష్కరిణిలో జపయజ్ఞం చేస్తున్నామన్ని సోమవారం నుంచి భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతిస్తామని తితిదే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటినీ మూసివేశారు..గ్రహణ మోక్షకాలం అనంతరం సంప్రోక్షణ, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు.. సోమవారం నుంచి భక్తులకు అనుమతి ఇస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

