కరోనా మెడిసిన్: 150మందిపై ప్రయోగించగా.. వారం రోజుల్లోనే రిజల్ట్

ప్రపంచాన్నివణికిస్తున్న కోవిడ్-19 వైరస్ నియంత్రణకు మెడిసిన్ వచ్చేసింది. కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్ ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి కూడా పొందినట్లు సంస్థ తెలిపింది.
ఇక.. ఈ కరోనా నివారణ మందును త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని తెలిపారు గ్లెన్‌మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్దన్హా. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయిస్తామన్నారు. అలాగే, ఒక్కో మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించారు. కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలనీ.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాల్సి ఉంటుందన్నారు. కరోనాపై ఫాబిఫ్లూనే తొలి ఓరల్ డ్రగ్ అని సంస్థ తెలిపారు.
దేశంలో రోజురోజుకు కేసులు పెరగడం.. దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో ఈ అనుమతులు లభించినట్లు గ్లెన్ సల్దన్హా తెలిపారు. ఈ మాత్ర వాడటం వల్ల 88 శాతం వైరస్ తగ్గినట్లు తెలిపారు. దేశంలోని 11 నగరాల నుంచి 150 మందిపై పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. అందరీకి రెండు వారాల ట్రీట్ మెంట్ చేయగా.. వారం రోజుల్లోనే చాలా మంది కోలుకున్నట్లు తెలిపారు.
దీని ద్వారా చికిత్స ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. క్లినికల్ ట్రయల్స్ సందర్భంలో ఫాబిఫ్లూను కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చినట్లు నిర్ధారించారు. కరోనా లక్షణాలు స్వల్ప, మధ్య స్థాయిలో ఉన్న మధుమేహ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు సైతం ఈ ఔషధాన్ని వాడవచ్చు. ఈ ఔషధం కేవలం నాలుగు రోజుల్లోనే వైరల్ లోడ్ తగ్గిస్తున్నట్లు నిర్ధారించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com