దేశవ్యాప్తంగా కరోనాతో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 445 మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనాతో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 445 మంది మృతి
X

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... భారత్‌లో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ప్రపంచ దేశాల్లో సగటున లక్ష జనాభాను లెక్కలోకి తీసుకుంటే.. భారత్‌లో అతి తక్కువ కేసులు నమోదువుతున్నాయని కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 445 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. కరోనా విజృంభించాక.. ఒక్క రోజులో సంభవించిన కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13 వేల 699కి చేరింది. అటు దేశవ్యాప్తంగా కొత్తగా 14 వేల 821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 40 వేలు దాటింది. అయితే వీరిలో 2 లక్షల 37 వేల మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఒక లక్షా 75 వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఒక లక్షా 43 వేల 267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న... మహారాష్ట్రలో కరోనా కేసులు ఒక లక్షా 35 వేలు దాటగా... 6 వేల 170 మంది ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో పాజిటివ్ కేసులు దాదాపు 62 వేలకు చేరుకోగా... 2 వేల 175 కన్నుమూశారు. అటు తమిళనాడులోనూ కరోనా పాజిటివ్ కేసులు 62 దాటగా... 575 మంది మహమ్మారి బారిన పడి చనిపోయారు. గుజరాత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 27 వేలు దాటాయి. యూపీ, రాజస్థాన్‌, వెస్ట్‌ బెంగాల్‌, మధ్య ప్రదేశ్‌, హర్యానాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.

భారత్‌లో లక్ష జనాభాకు సగటున 30.04 కరోనా రోగులు ఉండగా... ప్రపంచ దేశాల్లో సగటు మూడు రెట్లు అధికంగా ఉంది. అమెరికాలో ప్రతి లక్ష జనాభాకు 671 మంది కరోనా బారినపడుతున్నారు. అటు ఆగ్రాలో గత 48 గంటల్లో 28 మంది కరోనాతో మృత్యవాత పడటం కలకలం రేపింది. కాన్పూర్‌లోని ప్రభుత్వ బాలికల ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలకు కరోనా సోకింది. ప్రస్తుతం ఈ ఆశ్రయ గృహాన్ని మూసేసిన ప్రభుత్వం సంబంధిత సిబ్బందిని క్వారంటైన్‌ చేశారు. కర్నాటకలో పెరుగుతున్న కేసులపై యడియూరప్ప ప్రభుత్వ అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన కోవిడ్‌ కేంద్రాలను గుర్తించి సరిహద్దులు మూసివేయాలని అధికారులను ఆదేశించారు.

Tags

Next Story