సినిమా టైటిల్ చూసి కథను ఊహించడం పరిణతి చెందిన వ్యక్తుల లక్షణం కాదు: వర్మ

మర్డర్ సినిమా పోస్టర్ చూసి ప్రణయ్ భార్య అమృత స్పందించిన తీరుకి వర్మ వివరణ ఇచ్చుకున్నారు. ఇది ఆమె చెప్పిందో లేక ఊహాజనితంగా క్రియేట్ చేశారో తెలియదు కానీ ఎవరి కోణంలో వారు చూశారు. ఏదేమైనా స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇది నిజ జీవిత కథ ఆధారంగా అని పోస్టర్ లో పేర్కొన్నా. కానీ అది నిజమైన కథని నేను చెప్పలేదు. ఈ కథకు అనేక కోణాలు, కారణాలు ఉండొచ్చు. నేను ఎలా తీశాను అనేది సినిమా విడుదలైన తరువాత తెలుస్తుంది. ముందుగా ఊహించి చెప్పడం అనేది పరిణతి చెందిన వ్యక్తుల లక్షణం కాదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.
ఈ కేసు కవర్ చేసిన ఒక పాత్రికేయుడి కోణంలో సినిమా ఉండొచ్చు, లేదంటే ఒక పోలీస్ అధికారి ఆలోచనలకు సంబంధించింది కావొచ్చు, లేదా వివిధ మార్గాల ద్వారా దీని గురించి తెలుసుకున్న వ్యక్తి ఉద్దేశం అయినా కావొచ్చు. ఓ దర్శకుడిగా, నిర్మాతగా నా ఆలోచనల ప్రకారం కథను తెరకెక్కించే హక్కు నాకుంది. అంతమాత్రాన నేను చెడుగా చూపించడానికి సినిమా తీస్తున్నాను అని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు.
ఎందుకంటే ఎవరూ చెడ్డ వాళ్లు కాదు. పరిస్థితులు వాళ్లని అలా తయారు చేస్తాయి. దాన్నే నేను మర్డర్ సినిమాలో చూపించాలనుకుంటున్నా. ఒకవేళ అమృత అభిప్రాయం చెప్పినా, మీరు ఊహించి రాసినా నేను మాత్రం ఒకటి చెప్పదల్చుకున్నాను... నాకు మనుషులపై వారి ఫీలింగ్స్ పై గౌరవం ఉంది. వారు పడ్డ బాధను, నేర్చుకున్న పాఠాన్ని గౌరవిస్తూ మర్డర్ చిత్రాన్ని తీస్తున్నా అని వర్మ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com