పుట్టినరోజు వేడుకల్లో కరోనాకి ఆహ్వానం.. ఇద్దరు మృతి.. 20 మందికి పాజిటివ్..

పుట్టినరోజు వేడుకల్లో కరోనాకి ఆహ్వానం.. ఇద్దరు మృతి.. 20 మందికి పాజిటివ్..

పుట్టినరోజులు, పెళ్లిళ్లు.. ఇలా ఏ వేడుక నిర్వహించినా కరోనాకి స్వాగతం పలికినట్టే ఉంది ప్రస్తుత పరిస్థితి. తాజాగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఓ వజ్రాల వ్యాపారి కుటుంబంలో విషాదం నెలకొంది. వేడుక జరుపుకున్న వ్యాపారితో పాటు మరో వ్యాపారి కరోనాతో మరణించగా, వేడుకకు హాజరైన 20మంది అతిధులకు కరోనా సోకింది.

హిమాయత్ నగర్ లో నివాసం ఉంటున్న ఓ నగల దుకాణం వర్తకుడు గతనెల మూడో వారంలో తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకకు ఓ ప్రజా ప్రతినిధితో పాటు, బంధువులు, స్నేహితులు కలిపి మొత్తం 150మంది దాకా హాజరయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా అని సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. విందుకు ఉపయోగించిన పాత్రలు, వేడుక ఏర్పాటు చేసిన హాలు అన్నీ ఎంతో జాగ్రత్తగా శానిటైజ్ చేయించి మరీ వేడుక నిర్వహించారు. శుభాకాంక్షలు తెలిపిన వారికి రిటర్న్ గిప్ట్ లు కూడా ఇచ్చారు. అంతా మంచిగా జరిగింది అని అనుకునేలోపు పుట్టిన రోజు చేసుకున్న వ్యాపారికి మూడు రోజుల అనంతరం దగ్గు, ఆయాసం వచ్చింది. వెంటనే డాక్టరుకి చూపించుకుంటే మందులతో పాటు కరోనా టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పారు. కానీ ఆ వ్యాపారి సాధారణ దగ్గుగానే భావించి కొవిడ్ టెస్ట్ చేయించుకోలేదు.

విందుకు హాజరైన మరో నగల వ్యాపారి పరిస్థితి కూడా అలాగే ఉండడంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోమన్నా అశ్రద్ధ చేశారు. అనంతరం పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు.. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించారు. పుట్టిన రోజు జరుపుకున్న వ్యాపారీ మృతి చెందారు. వేడుకకు హాజరైన అతిధులందరూ హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story