తల్లి గర్భంలోనే శిశువుకు సోకిన కరోనా!

కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరనీ ఈ కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కరోనా వైరస్ సోకుతోంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు తన ప్రతాపం చూపిస్తోంంది. తాజాగా తల్లి గర్భంలోనే శిశువుకు కరోనా సోకింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
నంగ్లోయికి చెందిన 25 ఏళ్ల మహిళ గర్భిణికి.. జూన్ 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. భర్త కూడా కరోనా సోకడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గర్భిణికి జూన్ 25న మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో పాజిటివ్‌గా వచ్చింది. మళ్లీ జులై 7వ తేదీన ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ మరుసటి రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే బిడ్డ పుట్టిన ఆరు గంటల తర్వాత.. చిన్నారి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఫలితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని రామ్ మనోహర్ లోహియా డాక్టర్లు తెలిపారు. ఇలాంటి కేసు దేశంలోనే మొదటిసారి అని డాక్టర్లు తెలిపారు. చిన్నారికి కరోనా ఇన్ ఫెక్షన్ అధికంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

