భయపడొద్దు.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.: కరోనాను జయించిన రచయిత్రి

ఎక్కడ మనకి కరోనా వస్తుందో అని ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఎవరి ద్వారా వచ్చిందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. మనల్ని కూడా కరోనా బారిన పడేస్తుంది. రాకముందు వస్తుందేమో అని భయం.. వచ్చిన తరువాత ఎలా బయటపడాలి అన్న భయం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని నిరభ్యంతరంగా జయించవచ్చంటున్నారు 'లిప్తకాలపు స్వప్నం' పుసక్త రచయిత్రి స్వర్ణ కిలారి. కోవిడ్‌ను జయించాక ఆమె రాసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కొవిడ్ వ్యాధి విస్తృతమవుతుందని అర్థమైంది. నాక్కూడా ఒకరోజు ఒళ్లు కాస్త వేడిగా అనిపించింది. రాత్రికల్లా ఎక్కువైంది. దాంతో పారాసిటమల్ వేసుకున్నాను.
రెండు మూడు రోజులు 99-100 డిగ్రీలు ఉండేది టెంపరేచర్. తర్వాత నాతోనే ఉండే నా చెల్లి కూతురు దరహాసకు కూడా జ్వరం వచ్చింది. కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో టెస్ట్ చేయించుకున్నాము, రిపోర్ట్ వచ్చేలోపు బాగా నీరసం, దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లం, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి అన్ని లక్షణాలు కనిపించాయి. ఈ లోపు రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ముందు కాస్త భయపడ్డా.. వెంటనే తేరుకుని ఏం చేయాలో ఆలోచించాము.
ముందుగా చేసిన పని ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్లకు ఫోన్ చేసి వారు చెప్పిన ప్రకారం మందులు వాడడం మొదలు పెట్టాము. మొదటి నాలుగు రోజులు పారాసిటమల్, తరువాత విటమిన్ సీ,డీ, జింక్, యాంటిబయాటిక్ ఇచ్చారు. ప్రతి రోజూ టెంపరేచర్ చెక్ చేసుకోవడం, ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ శాచురేషన్ చెక్ చేసుకోవడం చేశాము. ఉదయం ఒకసారి కషాయం, ఉడకబెట్టిన గుడ్డు, నానబెట్టిన బాదం, మొలకలు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మళ్లీ సాయింత్రం కషాయం, ఒక ఫ్రూట్ జ్యూస్, రాత్రికి చపాతీ, ఒక కప్పు పసుపు వేసిన పాలు, రెండ్రోజులకు ఒకసారి భోజనంలో చికెన్ కూడా తీసుకున్నాము.
ఇలా సరైన డైట్ తీసుకుని ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు నేను చూడాలనుకున్న సినిమాలన్నీ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో చూశాము. పెండింగ్ లో ఉన్న ఆర్టికల్స్ రెండు రాశాను. రోజూ యోగాసనాలు, గదిలోనే వాకింగ్ చేశాను. మధ్యలో ప్రభుత్వ కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసి మా ఆరోగ్యం గురించి వాకబు చేసేవారు. ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే.. కరోనా అనేది ఓ కొత్త వ్యాధి. లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నాయి. లక్షణ తీవ్రతను బట్టి డాక్టర్ సలహా మేరకు ఇంట్లో ఉండాలా, హాస్పిటల్ లో ఉండాలా అనేది నిర్ణయించుకోవాలి. కరోనా నుంచి బయటపడాలంటే ముందు కావలసింది ధైర్యం. మనం జాగ్రత్తగా ఉంటే మరొకరికి వ్యాపించకుండా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com