ప్రభుత్వ తీరు మారకపోతే ముందు పరిస్థితులు మరింత కఠినం: ఆంటోనీ ఫాసీ

కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువవుతుండడంతో అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఇక్కడి దక్షిణ, పశ్చిమాది రాష్ట్రాలు కొత్త హాట్ స్పాట్ లుగా మారాయి. ఇప్పటికే 39 లక్షల 19 వేల కేసులు, లక్షా 43 వేల మృతులు నమోదయ్యాయి. ఒకప్పుడు రోజుకి 20 వేల కోవిడ్ కేసులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్, త్రిబుల్ అయ్యింది. ప్రస్తుతం రోజుకి 60, 70 వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. యూరప్ లో నమోదవుతున్న కేసుల కంటే అయిదు రెట్లు ఎక్కువ కేసులు ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి.
50 రాష్ట్రాలకు గాను 40 రాష్ట్రాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. గత రెండు వారాల్లో కేసులు 50% పెరిగితే, మరణాల రేటు 46% పెరిగింది. గతంలో ఒక్క న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉంటే, ఇప్పుడు అరిజోనా, ప్లోరిడా, టెక్సాస్, జార్జియా, అలబామా, లూసియానా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభిస్తోంది. టెక్పాస్ లో రెండు వారాల లాక్ డౌన్ విధించారు. కాలిఫోర్నియాలో రెస్టారెంట్లు, బార్లు, చర్చిలు మూసివేశారు. ఇక అరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడాలలో అయితే మరణాల సంఖ్య అధికంగా ఉంది.
రానున్న శీతాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, పరిస్థితిని అంచనా వేయడానికే భయంగా ఉందని డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) డాక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాని కట్టడి చేయడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా తీరు మార్చుకోపోతే ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణుడు ఆంటోనీ ఫాసీ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com