ఒకే కుటుంబంలోని ఆరుగురు కరోనాతో మృతి

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. జార్ఖండ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనాతో మృతి చెందారు. ధన్బాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాట్రాస్‌లోని ఒక కుటుంబానికి చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలో జరిగే వివాహానికి హాజరై ధన్బాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆమె అనారోగ్యానికి గురై బొకారోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 4న మరిణించింది. ఐదుగురు కుమారులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.
అనంతరం ఐదుగురు కుమారులకు కూడా కరోనా సోకింది. చికిత్స పొందుతున్న వీరింతా ఇటీవల వరుసగా మరణించారు. ఆ కుటుంబంలోని మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. కాగా జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,500 దాటింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

