కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లా.. రూ.1000లోపే ఔషధాలు: ఈటల రాజేందర్

కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లు వసూలు చేస్తున్నారు. రోగికి 10 రోజులు ఆక్సిజన్ పెట్టినా రూ.2,500 కాదు.. ఇది చాలా దారుణం. ఈ విధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై వేటు పడుతుంది అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయినా గాంధీ ఆస్పత్రిలోనైనా చికిత్స ఒకటే అని లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకు రండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా చికిత్సను వ్యాపారకోణంలో చూడొద్దని.. చికిత్సకు అనుమతించిన ఉద్దేశం వేరని ఆయన అన్నారు. రోగుల్లో విశ్వాసం కల్పిస్తారని ఊహిస్తే అక్కడ మరొకటి జరుగుతుందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు మొత్తం కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామనడం అత్యంత హేయమైన చర్య అని ఆయన అన్నారు. మంగళవారం కోఠీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడారు.
కరోనా వచ్చిన రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే బతుకుతామని, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే మరణిస్తామని ప్రజలు అనుకోవడం సరికాదన్నారు. వానాకాలంలో వచ్చే జలుబు, దగ్గులను కూడా నిర్లక్ష్యం చేయవద్దన్నారు. వెంటనే స్థానిక పీహెచ్‌సీకి వెళ్లాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని.. కరోనాకు వేసుకునే మందులు రూ.1000లోపే ఉంటాయని అన్నారు.
గాంధీకి వచ్చే వారంతా సీరియస్ కండిషన్లో ఉన్నవారే వస్తున్నారని.. ప్రైవేట్ ఆస్పత్రులు సైతం అలాంటి రోగులను గాంధీకి పంపుతున్నారని ఈటల అన్నారు. కరోనాపై ఓ అంచనాకు వచ్చామని.. అంటుకోగానే చంపే వైరస్ కాదని అన్నారు. కరోనా కంటే భయంకరమైన జబ్బులు వచ్చినా ఈ స్థాయిలో ప్రచారం జరగలేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com