కోజికోడ్ విమాన ప్రమాదం.. సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా
కోజికోడ్ విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లతోసహా 18 మంది మరణించారు. తాజాగా మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా సోకిందని మలప్పురం వైద్యాధికారి తెలిపారు. దుబాయ్ లో ఉన్న భారతీయులను తీసుకువచ్చే ప్రయత్నంలో వందే భారత్ మిషన్ కింద 184 మంది ప్రయాణీకులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తీసుకువచ్చింది. ఆ సమయంలో విమానం లాండ్ అవుతుండగా భారీ ప్రమాదం జరిగి ఫ్లైట్ రెండు ముక్కలైంది.
కొంత మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా విమాన ప్రమాదంతో అప్రమత్తమైన అధికారులు జోరున వర్షం కురుస్తున్నా సహాయక చర్యలు ముమ్మరం చేసారు. ఓ పక్క కోవిడ్ భయం వణికిస్తున్నా విధుల్లో తలమునకలయ్యారు. సామాజిక దూరాన్నీ మర్చిపోయారు. మాస్కులూ ధరించలేకపోయారు. ఏది ఏమైనా 22 మంది అధికారులు కోవిడ్ బారిన పడ్డారు. ప్రమాదంలో గాయాలైన 150మందికి కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజువారీ ఇన్ఫెక్షన్లతో కేరళలో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలజ చెప్పారు.
"ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం కేరళలో 1,564 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 39,708 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,007 మంది మరణించారని, 64,553 పాజిటివ్ కేసులను భారత్ నమోదు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com