బ్యాడ్ న్యూస్..మరో వారం పాటు...

Update: 2019-06-06 03:31 GMT

నైరుతి దోబూచులాడుతోంది. రుతు పవనాల రాక మరింత ఆలస్యం అవుతాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో మండుతున్న ఎండల నుంచి అల్లాడిపోతున్న జనాలకు..మరో వారం దాకా ఉపశమనం లభించేలా కనిపించడం లేదు. రుతుపవనాలు జూన్‌ 8న కేరళ తీరాన్ని తాకుతుందని ఐఎండీ వెల్లడించింది.

ఈ నెల 11న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోకి... 13న దక్షిణ తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అయితే అదే రోజు రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని చెప్పలేమని... రెండు రోజులు అటూ ఇటూగా ఉండొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉపరిత ఆవర్తనం కొనసాగుతోందని..దీని ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెబుతున్నారు.

నిజానికి జూన్‌ 1నే కేరళను నైరుతి రుతు పవనాలు తాకాల్సి ఉంది. వాతావరణ శాఖ కూడా అనుకున్న సమయానికే రుతు వవనాలు ప్రవేశిస్తాయని చెప్పారు. కానీ వాతావరణ అధికారుల అంచనా కూడా తలకిందులైంది. నైరుతి రుతు పవనాలు గతేడాది కూడా ఆలస్యంగానే రాష్ట్రంలో ప్రవేశించాయి. 2018లో జూన్‌ 8న, 2017లో జూన్‌ 12న తెలంగాణలోకి ప్రవేశిస్తే... 2016 లో జూన్‌ 17న, 2015లో జూన్‌ 13న, 2014లో జూన్‌ 19న రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకాయి. గతేడాది ఇదే సీజన్‌లో 97 శాతం వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అందుకు భిన్నంగా 92 శాతం వర్షపాతమే రాష్ట్రంలో నమోదైంది. మరి ఈ ఏడాది ఎలా ఉంటుందనే ఆందోళన కూడా రైతుల్లో నెలకొంది.

మరోవైపు రుతు పవనాల రాక ఆలస్యమయ్యే కొద్ది ఉష్ణోగ్రతలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా.. మళ్లీ గణనీయంగా పెరిగాయి. బుధవారం కూడా పలుచోట్ల 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News