ఆయన అలా అనలేదు.. ఆ వార్తల్లో నిజం లేదు: కిషన్ రెడ్డి

Update: 2019-06-06 01:23 GMT

తెలంగాణలో బీజేపీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. మజ్లిస్‌తో అంటకాగిన టిఆర్‌ఎస్‌ గురించి త్వరగానే ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీలో బిజీబిజీగా ఉన్న ఆయన.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు.

హోంశాఖ సహాయమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మొక్క నాటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరు ప్రాధాన్యతగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు..

తెలంగాణలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని, తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమై అధికారం దక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మజ్లిస్‌తో టిఆర్‌ఎస్‌ అంటకాగుతోందని ఆరోపించారు. మరోవైపు తనను కేంద్రహోం మంత్రి అమిత్ షా మందలించారన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఉగ్రవాద దాడులకు హైదరాబాద్‌తో ముడిపెడుతూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని అన్నారు. విభజన చట్టం అంశాలు నెరవేర్చాలా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించేలా తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా నీతి నిజాయితీగా పనిచేస్తానన్నారు.

Similar News