సీఎంగా తొలిసారి సభలో అడుగుపెడుతున్న జగన్..

Update: 2019-06-11 15:24 GMT

బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో Y.S జగన్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు విపక్ష నేతగా అడుగుపెట్టనున్నారు. ఇక ఏకైక జనసేన ఎమ్మెల్యే ఈ అంసెబ్లీలో ప్రత్యేకార్షణ.

సీఎం జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. బుధవారం నుంచి అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఐదురోజుల పాటు శాసనసభ సమావేశాలు ఉంటాయి, ఉదయం 11.05 నిమిషాలకు తొలిరోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. కొత్తగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ముందుగా సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణం చేస్తారు.

తొలిరోజు సభ్యుల ప్రమాణస్వీకారంలో ఎవరైనా మిగిలి ఉంటే రెండో రోజు జూన్ 13న ప్రమాణం చేస్తారు. అదే రోజు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇదివరకే తమ్మినేని సీతారంను స్పీకర్ గా సీఎం జగన్ ప్రకటించడంతో ఆయన ఎన్నిక లాంఛనమే. జూన్ 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మాన చర్చ ఉంటుంది. జూన్ 15,16 తేదీలు శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు. తిరిగి సోమవారం అసెంబ్లీ సమావేశమవుతుంది. సోమ, మంగళవారాల్లో వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది.

బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ తొలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయాల్సిన దిశానిర్దేశం వంటి అంశాలపై వైసీపీ నేతలు ఇదివరకే చర్చించారు. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు వారికి ఇచ్చిన హామీల అమలుపై సీఎం జగన్ కీలక ప్రకటనలు చేయనున్నారు. అటు ప్రధాన విపక్షం టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో అమరావతిలో భేటీ అయ్యారు. అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Similar News