AP Government : ఎన్నికల వేళ ఉద్యోగులకు వైసీపీ బకాయిల ఎర

మండిపడుతున్న ఉద్యోగ సంఘాల నేత

Update: 2024-04-27 02:45 GMT

 ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్‌ సర్కార్‌కు పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ.... వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్‌ లీవుల బకాయిలను హడావుడిగా చెల్లిస్తోంది. ఇన్నాళ్లూ తమపై కక్షగట్టి, హక్కులను కాలరాసి, స్వేచ్ఛను హరించి, గొంతు నొక్కేసిన ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఎర వేస్తోందా అని ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మిగిలిన తమ బకాయిల సంగతేంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

పోలింగ్‌ తేదీ సమీవిస్తున్న వేళ ప్రభుత్వం ఉద్యోగులకు సరెండర్‌ లీవ్స్‌ బకాయిలు హడావుడిగా చెల్లించే నిర్ణయం తీసుకుంది. పోలీసులతోపాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు, శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేయగా... ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశముంది. తమ ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే..... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తమకు రావాల్సిన సరెండర్‌ లీవ్‌ సొమ్ములనే విడుదల చేసి... ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమకల్పిస్తోందని మండిపడ్డారు. న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ తాము ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించులేదన్నారు. పైగా తమ ఆందోళనలు, ఉద్యమాలను జగన్‌ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసిందని గుర్తుచేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు. సుమారు 17 వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా.. అవన్నీ పెండింగ్‌లో పెట్టిందని.... సరెండర్‌ లీవుల బకాయిలు మాత్రమే చెల్లిస్తోందని ధ్వజమెత్తారు. అదీ అందరికి ఒకేసారి ఇవ్వకుండా, విడతల వారీగా రోజుకు కొందరి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా 17 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. DA, PRC బకాయిలు 7వేల 500 కోట్ల రూపాయలు రావాలి. వీటిని 2027లోగా దశల వారీగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది. T.A., D.A. బకాయిలు 274 కోట్ల రూపాయలవరకు ఉన్నాయి. సరెండర్‌ లీవుల బకాయిలు 2వేల 250 కోట్ల రూపాయలు ఉండగా... వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మే 500 కోట్ల రూపాయలు. 2021-22 నాటికి పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరో 300 కోట్ల రూపాయలు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు 118 కోట్ల విడుదల చేయలేదు.  

Tags:    

Similar News