టీమిండియాకు ఊహించని షాక్‌.. శిఖర్ ధవన్ స్థానంలో..

Update: 2019-06-12 01:55 GMT

వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. వరుస రెండు విజయాలతో జోష్‌ మీదున్న ఉన్న కోహ్లీ సేనకు దెబ్బ తగిలింది. బొటనవేలు గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధవన్ మూడు వారాల పాటు టోర్నమెంటు నుంచి వైదొలగనున్నాడు. ఆదివారం ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధవన్ ఎడమ చేతి బొటనవేలికి బంతి బలంగా తగిలింది. చేతికి గాయమైనప్పటికీ క్రీజులో నుంచి బయటికి రాకుండా బ్యాటింగ్ చేసిన ధవన్.. ఆస్ట్రేలియాపై 117 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే స్కానింగ్ చేయడంతో వేలు ఎముక చిట్లినట్టు తేలింది. దీంతో కనీసం మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

మూడు వారాల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతో జరిగే మ్యాచ్‌లలో శిఖర్ ధవన్ ఆడే అవకాశం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ జూన్‌లోనే జరగనున్నాయి. శిఖర్ ధవన్ స్థానంలో శ్రియాస్ అయ్యర్, రిషబ్ పంత్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.. ధవన్‌ దూరమైన నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌లకు కేఎల్‌ రాహుల్‌.. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయడం ఖాయం. నాలుగో స్థానానికి ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ రేసులో ఉన్నారు. కొంతమేర బౌలింగ్‌కు కూడా అవసరమనుకుంటే శంకర్‌ను.. బ్యాటింగ్‌ చాలనుకుంటే కార్తీక్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది.

ధావన్‌ అవసరం జట్టుకు చాలానే ఉండటంతో అతను ఎప్పుడు కోలుకుంటే అప్పుడు తుది జట్టులోకి తీసుకుందామనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇప్పటికిప్పుడు ఎంచుకోలేదు. అయితే ఒకవేళ మరో ఆటగాడు గాయపడితే పరిస్థితేంటన్నది సందేహం. అప్పుడు కచ్చితంగా ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవాల్సిందే. ఆ స్థితిలో అప్పటికప్పుడు పంత్‌ను రప్పించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను ముందు జాగ్రత్తగా ఇంగ్లాండ్‌కు రిషబ్‌ పంత్‌ను పంపే అవకాశాలున్నాయి. ధావన్‌ త్వరగా కోలుకునే అవకాశం లేదని తెలిసినా.. లేదా మరో ఆటగాడు ఎవరైనా గాయపడ్డా వెంటనే పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడానికి అవకాశముంటుంది.

Similar News