DC vs MI: సొంత ఇలాఖాలో దుమ్ము రేపిన ఢిల్లీ
జేక్ ఫ్రేజర్, స్టబ్స్ వీరవిహారం, తిలక్‌వర్మ పోరు వృథా;
ఐపీఎల్‌లో మరో భారీ స్కోరు అభిమానులను అలరించింది. శనివారం జరిగిన తొలి పోరులో ఢిల్లీ 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత జేక్ ఫ్రేజర్ అర్ధసెంచరీకి తోడు స్టబ్స్ , హోప్ రాణించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 257/4 భారీ స్కోరు చేసింది. నబీ, చావ్లా, బుమ్రా, వుడ్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 247/9 స్కోరు చేసింది. తిలక్‌వర్మ, హార్దిక్‌పాండ్యా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తిలక్‌వర్మ సూపర్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు.ముకేశ్‌కుమార్ , రసిక్ సలామ్ మూడేసి వికెట్లు తీశారు. ఫ్రేజర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా..ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక్కడే పాండ్యా పప్పులో కాలేశాడు. అందివచ్చిన అవకాశాన్ని ఢిల్లీ చక్కగా వినియోగించుకుంది. ఓపెనర్ ఫ్రేజర్ తొలి బంతి నుంచే విధ్వంసానికి తెరతీశాడు. ఫలితంగా 19 పరుగులు వచ్చిపడ్డాయి. రెండో ఓవర్‌కు దిగిన బుమ్రాను కూడా ఫ్రేజర్ గట్గిగానే అరుసుకున్నాడు. నోబాల్‌తో బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా ఓవర్‌లో 18 పరుగులు పిండుకున్నాడు.
ఆ తర్వాత తుషారకు మూడు ఫోర్లతో స్వాగతం పలికాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన చావ్లాను విడిచిపెట్టకుండా బాదడంతో 15 బంతుల్లోనే ఫ్రేజర్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. లాభం లేదనుకుని బౌలింగ్‌కు వచ్చిన కెప్టెన్ పాండ్యాను ఫ్రేజర్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు దంచుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ కోల్పోకుండా 92 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఫ్రేజర్‌ను చావ్లా ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన హోప్..పోరెల్‌కు జతకలిశాడు. హోప్ ఉన్నంతసేపు సిక్స్‌లతో స్టేడియాన్ని ఊపేశాడు. నబీ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్‌తో పోరెల్ ఔటయ్యాడు. రిషబ్ పంత్(29) ఫర్వాలేదనిపించినా..ఆఖర్లో స్టబ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వుడ్ వేసిన 18వ ఓవర్లలో స్టబ్స్ ఐదు ఫోర్లు, సిక్స్‌తో 26 పరుగులు కొల్లగొట్టాడు.
తిలక్ పోరాడినా:
నిర్దేశిత లక్ష్యఛేదనలో ముంబైకి సరైన శుభారంభం దక్కలేదు. రోహిత్‌శర్మ, ఇషాన్‌కిషన్‌నిరాశపరిచారు. ఖలీల్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన రోహిత్..హోప్ క్యాచ్‌తో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. పది పరుగుల తేడాతో కిషన్ కూడా ఔట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. ఈ దశలో ఆదుకుంటాడనుకున్న సూర్యకుమార్‌ఉన్నంతసేపు బ్యాటు ఝులిపించినా..అదే జోరు కొనసాగించలేకపోయాడు. యువ బ్యాటర్ తిలక్‌వర్మ మంచి పరిణితి కనబరిచాడు. సహచరులు ఒక్కొక్కరుగా ఔట్ అవుతున్నా..కెప్టెన్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు కలిసి ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేశారు.
సలాం బౌలింగ్‌లో ముకేశ్ క్యాచ్‌తో పాండ్యా ఔటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 71 పరుగుల పార్టనర్‌షిప్‌కు బ్రేక్‌పడింది. వదేరావిఫలం కాగా, డేవిడ్‌తో కలిసి వర్మ..మళ్లీ ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. వీరిద్దరి ఆటతో ఒక దశలో ముంబై గెలుస్తుందనిపించింది. కానీ డేవిడ్, నబీ ఔట్ కావడం ముంబై చాన్స్‌ను దెబ్బతీసింది. ఆఖరి ఓవర్లో 25 పరుగులు అవసరమైన దశలో తొలి బంతికే వర్మ రనౌట్ కావడంతో ముంబై ఓటమి ఖరారైంది.