26 ఏళ్లకే ఎంపీగా లోక్‌సభలో..

Update: 2019-06-13 11:10 GMT

చదువుకున్నవారు రాజకీయాల్లోకి వస్తే సమాజం బాగుపడుతుంది. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కార దిశగా ప్రయత్నాలు ప్రారంభించొచ్చు. ముఖ్యంగా చట్టసభల్లో ప్రజల తరపున వాణిని వినిపించడానికి మార్గం సుగమమవుతుంది. అదే స్ఫూర్తిని చంద్రాణీ ముర్ములో నింపారు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తల్లి తండ్రులతో పాటు ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్న చంద్రాణీ మెకానికల్ ఇంజనీరింగ్‌తో బీటెక్ పూర్తి చేసింది. ప్రవేట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినా కాదని ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తోంది. ఆసమయంలోనే బీజేడీ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. చదువుతున్న వారికోసం వెతుకుతున్న సందర్భంలో నేను వారికి ఒక ఆప్షన్ అయ్యాను.

చదువుకునేటప్పుడు రాజకీయాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ గెలుపుకోసం ప్రయత్నించాను. ప్రజా సమస్యల పరిష్కారానికై ముందడుగేసాను. ఎన్నికల్లో విజయం సాధించాను. ఈ విజయం బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ దేనని వినమ్రంగా చెబుతోంది ఈ 26 ఏళ్ల ఎంపీ. తండ్రి తరపున రాజకీయాల్లో ఎవరూ లేకపోయినా, తల్లి తరపు నుంచి తాతయ్య హరిహర్ సోరెన్ గతంలో ఎంపీగా పని చేశారు. తాతయ్యే తనకు ఆదర్శమని అంటోంది. ఇలా కుటుంబంలో రాజకీయ నేపధ్యం ఉన్నా క్రియా శీల రాజకీయాల్లో ఎవరూ లేరు అని చెప్పుకొచ్చింది చంద్రాణి. కేంఝర్‌లో గిరిజన జనాభా చాలా ఎక్కువగా నివసిస్తోంది. ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నా వాటి పట్ల అవగాహన లేక దుర్వినయోగమవుతున్నాయి. చదువు లేక వెనుకబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వారందరికీ విద్య అందించేందుకు కృషి చేస్తానంటోంది ఎంపీ చంద్రాణి. తనకు వచ్చినట్లే రాజకీయాల్లో మరింత మందికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.

Similar News