కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు

Update: 2019-06-15 05:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో... ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధాని సహా ఇతర కేంద్రమంత్రులను కేసీఆర్ ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. కానీ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పనులతో పాటు రాష్ట్రంలోని పలు శాఖలపై కీలకమైన సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నందునే కేసీఆర్ నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్లడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. 18న మంత్రివర్గం సమావేశం.. 19న పార్టీ కార్యవర్గ విసృతస్థాయి సమావేశం ఉంది. దీంతో షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ బిజీబిజీ అయ్యారు. నిన్న అమిత్‌షాతో సమావేశమైన ఆయన.. కొద్దిసేపటి క్రితం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, హక్కుల సాధనకు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తున్నారు.

సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు ఏపీ ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే అమిత్ షాను కలిసిన జగన్.. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి మోదీని ఒప్పించాలని కోరారు. మరోవైపు.. రెండ్రోజులు ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News