తొలకరితో పులకించిన పుడమి…మరో రెండ్రోజులు పాటు వర్షాలు

Update: 2019-06-23 02:46 GMT

నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడటంతో రిలీఫ్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ రుతుపవనాలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి.. ఈరోజు పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశం కనబడుతోంది.. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి వైపునకు విస్తరించడంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి.. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

సముద్రంలోని అల్పపీడనం జార్ఖండ్‌కు ఆనుకుని ఒడిశా వైపు వెళ్లింది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే, నైరుతి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. అటు ఇప్పటికే ఏపీ అంతటా వ్యాపించిన నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, మరట్వాడా, విదర్భ, కర్నాటకలోని మిగిలిన ప్రాంతాల్లోనూ విస్తరించాయి.

గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలోని గాంధారిలో 9 సెంటీమీటర్ల వర్షం కురవగా.. ఎల్లారెడ్డిలో 8, బాన్సువాడలో ఏడు సెటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.

Similar News