Punjab: పవిత్ర గ్రంథాన్ని చింపాడని యువకుడిని కొట్టి చంపిన సిక్కులు

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారాలో ఘటన

Update: 2024-05-05 05:30 GMT

పంజాబ్‌లోని గురుద్వారాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారాలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్‌ సాహిబ్‌ పేజీలను చింపేశాడనీ.. ఓ 19 ఏళ్ల యువకుడిని పట్టుకుని స్థానిక ప్రజలు శనివారం సాయత్రం తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బండాలా గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బక్షిష్‌ సింగ్‌ అనే యువకుడు గురుద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత పవిత్ర గ్రంథంలోని కొన్ని పేజీలను చింపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. యువకుడు పవిత్ర గ్రంథంలోని పేజీలు చింపేసి పారిపోతున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని అడ్డగించారు. అందరూ కోపంతో ఊగిపోతూ.. స్థానిక ప్రజలు సదురు యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. దాంతో బక్షిస్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పడికే చనిపోయాడని తెలిపారు. ఆ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడినందుకు పోలీసు కేసు నమోదైంది. కాగా.. అంతకుముందు సీనియర్ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సౌమ్య మిశ్రా సహా.. ఇతర ఉన్నతాధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. అతను మానసిక వికలాంగుడని, రెండేళ్లుగా మందులు వాడుతున్నాడని అతని తండ్రి లఖ్వీందర్ సింగ్ చెప్పారు. తన కొడుకును చంపిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

ఈ ఉదంతంపై సిక్కుల మత సంస్థ అకల్ తక్త్ స్పందించింది. పవిత్ర గ్రంథాన్ని ధ్వంసం చేసే ఘటనలను పునరావృతం కాకుండా చూడటంలో చట్టం విఫలమైందని విమర్శించింది. దోషులను శిక్షించడంలో చట్టం విఫలం కావడంతో న్యాయం కోసం ప్రజలు తిరగబడ్డారని.. అందుకే నిందితుడు మరణించాడని ఆ సంస్థ జతేదార్ జ్ఞానీ రఘ్బీర్ సింగ్ సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు. నిందితుడి అంత్యక్రియలను ఏ గురుద్వారాలో నిర్వహించరాదని.. అతని కుటుంబాన్ని సామాజికంగా, మతపరంగా వెలి వేయాలని సిక్కులకు పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News