మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, సాయమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. ఐదో కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇక తమకు పెళ్లిళ్లు జరగడం కష్టమని నలుగురు అక్కాచెల్లెళ్లు వెంకటమ్మ, అనిత, కృష్ణవేణి, యాదమ్మలు భావించారు. చెల్లెలు ప్రేమ వ్యవహారంతో మనస్తాపానికి గురై నలుగురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తల్లి సాయమ్మ, చిన్న చెల్లిని ఇంట్లోంచి బయటికి పంపి పురుగుల మందు తాగారు నలుగురు అక్కచెల్లెళ్లు. బలవంతంగా ఇంట్లోంచి బయటికి పంపడంతో తల్లికి అనుమానం వచ్చింది. చుట్టుపక్కలవారు తలుపులు పగలగొట్టి చూడగా ఈ నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ నలుగురు అక్కచెల్లెళ్లు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వీరికి వివాహాలు చేయకపోవడంతో తండ్రీ కూతుళ్ల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఇక.. తమకు పెళ్లికావడం లేదని మనస్తాపం, ఒక చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకుని పరువు బజారున పడేసిందని కుంగిపోయిన యువతులు.. కన్నవాళ్లకు భారం కాకూడదని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.