పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ మర్డర్ కేసులో కొగంటి సత్యం పేరు ప్రధానంగా వినపడింది. ఆయన్ను అరెస్టు చేస్తారన్న వార్తలూ వచ్చాయి. అయితే ఇంతలోనే తెరపైకి మరో కొత్త క్యారెక్టర్ వచ్చింది. రాంప్రసాద్ ను చంపింది నేనే నంటూ సంచలన అంశాలు వెల్లడించాడు నిందితుడు శ్యామ్. మర్డర్ చేసింది తానేనని.. చేయించింది మాత్రం రాంప్రసాద్ బావమరిది శ్రీనివాస్ అని చెప్పాడు. రాంప్రసాద్ పై అటాక్ చేసిన తర్వాత ఎల్బీనగర్ మీదుగా విజయవాడ పారిపోయినట్లు శ్యామ్ తెలిపాడు.
రాం ప్రసాద్ మర్డర్ కోసం చాలా రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు శ్యామ్. బొలరో వాహనం తీసుకొని నెల క్రితమే హైదరాబాద్ వచ్చినట్లు చెప్పాడు. కత్తులు కూడా విజయవాడలోనే తయారు చేయించానన్నాడు. రాం ప్రసాద్ మర్డర్ లో తనతో పాటు చోటు, చిన్న అనే ఇద్దరు కూడా పాల్గొన్నట్లు టీవీ5తో చెప్పుకొచ్చాడు శ్యామ్.
రాంప్రసాద్ కు తనకు ఎప్పటి నుంచో వైరం ఉందన్నాడు శ్యామ్. 2012లో తనపై తప్పుడు కేసు పెట్టించారని.. మళ్లీ 6 నెలల తర్వాత మరో కేసు పెట్టి వేధించారని అన్నాడు. అప్పట్లో రాంప్రసాద్, ఆయన బావమరిది శ్రీనివాస్ మధ్య సత్సంబంధాలే ఉండేవన్నాడు . ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేదాలు వచ్చాయని తెలిపాడు. రాంప్రసాద్ కారణంగా శ్రీనివాస్ కూడా భారీగా నష్టపోయాడని శ్యామ్ చెప్పాడు.. రాం ప్రసాద్ ను మర్డర్ చేస్తే 30 లక్షలు ఇస్తానని శ్రీనివాస్ ఆఫర్ చేశాడని సంచలన నిజాలు బయటపెట్టాడు. అంతే కాదు అందరికీ కోగంటి సత్యంపైనే అనుమానం వస్తుందని శ్రీనివాస్ ముందుగానే గెస్ చేశాడట.
అయితే మర్డర్ జరిగిన రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన శ్యామ్ పై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసులోంచి ప్రధాన నిందితులను తప్పించేందుకు ఈయన్ను తెరపైకి తీసుకొచ్చారన్న వాదన వినిపిస్తోంది. శ్యామ్ చెప్పే పలు అంశాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. శ్యామ్ చేస్తున్న ఆరోపణలపై రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ స్పందిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. తనపై దాడి జరగొచ్చని రాంప్రసాద్ ముందే ఊహించాడు. అందుకే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ప్రాణహాని ఉందంటూ.. గతంలో ఏపీ డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు.. ఆయన ఊహించినట్లే హైదరాబాద్ లోనే దారుణహత్యకు గురయ్యారు రాం ప్రసాద్.